Reading Time: 2 minutes

పెళ్లి వేడుకలో మారణహోమం.. ఆకట్టుకుంటున్న ‘నీలిర’ ట్రైలర్!

Caption of Image.

సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, చరిత్రలో అణచివేయబడ్డ గొంతుకలకు ప్రతిరూపం అని నిరూపించే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి కోవకే చెందుతుంది ‘నీలిర’. 1988 నాటి శ్రీలంక అంతర్యుద్ధం (Civil War) నేపథ్యంలో సాగే ఈ చిత్రం, అప్పటి భయానక పరిస్థితులను కళ్లకు కట్టేలా సిద్ధమైంది. వైవిధ్యమైన సినిమాలకు చిరునామాగా మారిన కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు సమర్పణలో  ఈ మూవీని తెరకెక్కించారు.  ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను లేటెస్ట్ గా మేకర్స్ రిలీజ్ చేశారు.

కథా నేపథ్యం

ట్రైలర్ గమనిస్తే, కథ ఎంతో ఆహ్లాదకరంగా, ఒక సందడితో కూడిన వివాహ వేడుకతో మొదలవుతుంది. బంధువుల కోలాహలం, నవ్వుల మధ్య సాగుతున్న ఆ వేడుకపై ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. తుపాకీ గుళ్ల మోత, బాంబుల బీభత్సం మధ్య ఆ కుటుంబం ఎలా చెల్లాచెదురైంది? మారణహోమం నుంచి ప్రాణాలను దక్కించుకోవడానికి వారు పడ్డ ఆవేదన ఏమిటి? అన్నదే ఈ చిత్ర ప్రధానాంశం. దర్శకుడు సోమీధరన్ ఈ సున్నితమైన అంశాన్ని అత్యంత సహజంగా, డాక్యుమెంటరీ స్టైల్ మేకింగ్‌తో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.

సామాన్యుల కన్నీటి గాథ..

వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర తన సహజ సిద్ధమైన నటనతో మరోసారి ఆకట్టుకోబోతున్నారు. సనంత్, రూప కొడువాయూర్, కపిల వేణు తమ పాత్రల్లో అలరించనున్నారు. యుద్ధం అంటే కేవలం దేశాల మధ్య పోరాటం కాదు, అది సామాన్య మానవుడి జీవితాన్ని ఎలా ఛిన్నాభిన్నం చేస్తుందో వీరి పాత్రల ద్వారా చూపించారు. దీనికి తోడు ‘K’ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ట్రైలర్‌లోని ఉత్కంఠను రెట్టింపు చేసింది. వెట్రిమారన్, లోకేష్ కనగరాజ్, ఏఆర్ మురుగదాస్ వంటి క్రియేటివ్ దర్శకులు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసలు కురిపించారు. యుద్ధం వెనుక దాగి ఉన్న సామాన్యుల కన్నీటి గాథలను ఈ సినిమా ప్రతిబింబిస్తుందని వారు కొనియాడారు.

►ALSO READ | రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం అఖిల్ త్యాగం.. ‘లెనిన్’ రిలీజ్ డేట్ మార్పు!

ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ పతాకంపై కార్తికేయన్ సంతానం, కార్తీక్ సుబ్బరాజు  నిర్మించారు. రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఈ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేస్తోంది. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 3, 2026న ‘నీలిర’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

 

©️ VIL Media Pvt Ltd.