
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను శనివారం నాడు నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి ఎదుగురు స్క్రిప్ట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ “నిహారిక నిర్మాతగా నేను హీరోగా చేస్తుండం ఎంతో స్పెషల్‌గా అనిపిస్తుంది. వంశీ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ టీం మీద ఉన్న నమ్మకంతోనే సినిమాకి ఓకే చెప్పాను. ఇదివరకే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.
వచ్చే సంక్రాంతికి ‘బరి’ సినిమాని బరిలోకి దించబోతోన్నాం” అని అన్నారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ “విలేజ్ డ్రామాగా, స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వంశీ ఈ సారి మరో అద్భుతమైన స్టోరీని చెప్పబోతోన్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ టీంతో మళ్లీ ఇలా సినిమా చేస్తుండటం నాకు ఆనందంగా ఉంది”అని తెలిపారు. యదు వంశీ మాట్లాడుతూ “వాలీబాల్ బ్యాక్‌డ్రాప్‌తో ఓ ఐడియా రాగానే నాకు వరుణ్ గుర్తుకువచ్చారు. అలా కొంత కథ అయ్యాక నిహారిక వద్దకే వెళ్లాను. పూర్తి కథ సిద్దం చేసిన తరువాత వరుణ్ అన్న దగ్గరకు వెళ్దామని నిహారిక అన్నారు. అలా మూడు నెలల్లో పూర్తి కథను సిద్ధంచేసి వరుణ్‌కి వినిపించగా ఆయనకి కథ చాలా నచ్చింది. షూటింగ్ త్వరగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి మా ‘బరి’ మూవీని బరిలోకి దించుతాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనుదీప్ దేవ్, చిన్నా పాల్గొన్నారు.