
- అమెరికా అవాక్స్ విమానం పేల్చివేత
- సౌదీలోని యూఎస్ బేస్‌పైకి 6 క్షిపణులు, 29 డ్రోన్లతో ఇరాన్ దాడి
- నిఘా విమానంతోపాటు మరికొన్ని జెట్లూ ధ్వంసం.. అమెరికాకు భారీ ఎదురుదెబ్బ
- టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ బాంబుల మోత
- పాకిస్తాన్లో గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ
- పశ్చిమాసియాకు వేలాదిగా బలగాల తరలింపు
- గ్రౌండ్ అటాక్కు అమెరికా రెడీ అంటూ వార్తలు
- అమెరికా సేనలు వస్తే తగలబెడ్తామని ఇరాన్ హెచ్చరిక
టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సౌదీ అరేబియాలోని యూఎస్ ఎయిర్ బేస్‌పై తాము జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో అమెరికాకు చెందిన కీలక నిఘా విమానం అవాక్స్ పూర్తిగా దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది.
ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై జరిగిన ఈ దాడుల్లో అమెరికా సైనిక నియంత్రణకు అత్యంత కీలకమైన ఈ3 అవాక్స్ విమానం పేలిపోయి ముక్కలైందని తెలిపింది. దీనికి సంబంధించి ఇరాన్ అధికారిక మీడియా ‘ప్రెస్ టీవీ’ కొన్ని చిత్రాలను విడుదల చేసింది. విమానం మధ్య భాగం పూర్తిగా దెబ్బతినగా, కేవలం ముందు, వెనుక భాగాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది. ఈ దాడిలో 6 బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్లను ఇరాన్ ఉపయోగించినట్లు తెలుస్తోంది.
ఈ దాడిలో కనీసం పదిమంది అమెరికా సైనికులు గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. అవాక్స్‌తో పాటు ఇంధనాన్ని నింపే మరికొన్ని విమానాలు కూడా ఈ దాడిలో దెబ్బతిన్నట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.
అయితే, ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్) ఇంకా స్పందించలేదు. హైఫాలోని ఇజ్రాయెల్ రక్షణ సంస్థ ‘ఎల్టా’కు చెందిన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ కేంద్రంపై, బెన్ గురియన్ విమానాశ్రయంలోని ఇంధన నిల్వ కేంద్రంపై కూడా దాడులు చేసినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది.
మరోవైపు, ఇజ్రాయెల్ లక్ష్యాలపై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు శనివారం క్షిపణులను ప్రయోగించిన నేపథ్యంలో.. దానికి ప్రతిస్పందనగా మరిన్ని దాడులు చేస్తామని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి కల్నల్ నదవ్ శోషాని ఆదివారం తెలిపారు. క్షిపణి ఉత్పత్తి కేంద్రాలతో పాటు ఇంకా చాలా లక్ష్యాలు తమ ముందు ఉన్నాయన్నారు. కాగా, ఆదివారం ఉదయం టెహ్రాన్ సమీపంలోని నివాస ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. ఖుజెస్తాన్ ప్రాంతంలోని నీటి సరఫరా కేంద్రం కూడా దెబ్బతిన్నది.
ఖర్గ్ ఐలాండ్, హార్మూజ్ స్వాధీనానికి ట్రంప్ ప్లాన్ ?
ఇరాన్‌తో ఒకవైపు చర్చలు అంటూనే.. మరోవైపు పశ్చిమాసియాకు వేలాది బలగాలను అమెరికా తరలిస్తోంది. దీంతో ఇరాన్‌పై అమెరికా గ్రౌండ్ అటాక్కు సిద్ధమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా హార్మూజ్ జలసంధి, ఖర్గ్ ఐలాండ్ తోపాటు తీరప్రాంతాలను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పావులు కదుపుతున్నారని ‘వాషింగ్టన్ పోస్ట్’ శనివారం ఒక కథనం ప్రచురించింది.
హార్మూజ్ జలసంధి సమీపంలోని తీర ప్రాంతాల్లో దాడులు చేసి, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఆయుధాలను ధ్వంసం చేయడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని.. ఈ లక్ష్యాలను పూర్తి చేయడానికి ‘కొన్ని వారాల నుంచి రెండు నెలల సమయం’ పట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
యుద్ధాన్ని ముగించే సంకేతాలను ట్రంప్ ఇచ్చినప్పటికీ.. ఇరాన్ ఒక ఒప్పందానికి రాకపోతే ఆ దేశానికి ‘నరకాన్ని చూపిస్తామని’ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ హెచ్చరించారు. కాగా, గడిచిన రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా పశ్చిమాసియాలో అమెరికా తన సైనిక శక్తిని భారీగా పెంచుతోంది.
శనివారం మరో 3,500 మంది మెరైన్లు, నావికులు ఈ ప్రాంతానికి చేరుకున్నట్లు అమెరికా ప్రకటించింది. జపాన్ నుంచి వచ్చిన ‘యూఎస్ఎస్ ట్రిపోలి’ యుద్ధ నౌక ద్వారా వీరు ఇక్కడికి చేరుకున్నారు. ఈ నౌకలో అత్యాధునిక ఎఫ్-35 యుద్ధ విమానాలు, సీ హాక్ హెలికాప్టర్లు, ఇతర యుద్ధ విమానాలు ఉన్నాయి.
పాక్‌లో గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ
యుద్ధానికి ముగింపు పలికేందుకు ఆదివారం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలత్తి, తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్, సౌదీ అరేబియా యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ సమావేశమయ్యారు.
యుద్ధ సమయంలో ఎక్కువగా మధ్యవర్తుల ద్వారానే సంప్రదింపులు జరుపుతున్న అమెరికా, ఇరాన్ మధ్య ‘నేరుగా చర్చలు’ ప్రారంభించడమే ఈ సమావేశాల లక్ష్యమని అబ్దెలత్తి తెలిపారు. మరోవైపు చర్చలు జరుగుతున్న టైంలోనే హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై ఇరాన్ కొన్ని ఆంక్షలను సడలించింది.
గల్ఫ్ దేశాలకు ఇరానే ‘ముప్పు’: యూఏఈ
పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి ఎలాంటి పరిష్కారం కుదిరినా.. పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు మళ్లీ పునరావృతం కాబోవనే ‘స్పష్టమైన హామీలు’ ఉండాలని యూఏఈ సలహాదారు అన్వర్ గర్గాష్ కోరారు. ఇరాన్ ప్రభుత్వం పర్షియన్ గల్ఫ్ భద్రతకు “ప్రధాన ముప్పు”గా మారిందని ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
పెరుగుతున్న మరణాల సంఖ్య
యుద్ధం కారణంగా ఇరాన్‌లో ఇప్పటివరకు 1,900 మందికి పైగా మరణించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. అటు ఇజ్రాయెల్‌లో 19 మంది మరణించారు. లెబనాన్‌లో 1,100 మందికి పైగా చనిపోయినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు.
అమెరికా సోల్జర్లను తగలబెడ్తం
తమ దేశంపై అమెరికా దళాలు భూతల దాడికి వస్తే వారిని ‘దహనం చేయడానికి’, వారి ప్రాంతీయ భాగస్వాములను శాశ్వతంగా శిక్షించడానికి ఇరాన్ దళాలు వేచి చూస్తున్నాయని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఖలీబాఫ్ ఆదివారం హెచ్చరించారు.
కాగా, గత వారం పాకిస్తాన్ ద్వారా అమెరికా పంపిన 15 అంశాల ప్రణాళికను ఖలీబాఫ్ కేవలం ‘వారి కోరికలు’గా అభివర్ణించారు. మరోవైపు, తమ దేశంలోని వర్సిటీలపై బాంబు దాడులను అమెరికా సోమవారం మధ్యాహ్నం 12 గంటల లోపు ఖండించకపోతే, పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాలు, అమెరికా వర్సిటీల శాఖలను ‘లక్ష్యాలుగా’ పరిగణిస్తామని ఐఆర్ జీసీ హెచ్చరించింది.
ఆకాశంలో కళ్లూ, చెవులూ..!
అమెరికా వైమానిక దళంలో అవాక్స్(ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం) విమానాన్ని ‘‘ఆకాశంలో కళ్లు, చెవులు’’గా అభివర్ణిస్తారు. యుద్ధ సమయంలో ఇది గాల్లోనే ఉండి ఒక కమాండ్ సెంటర్లా పనిచేస్తుంది. వందల కిలోమీటర్ల దూరంలోని శత్రువుల కదలికలను పసిగడుతుంది. శత్రువుల విమానాలు, క్షిపణులను పసిగట్టి తమ దళాలను అప్రమత్తం చేస్తుంది. ఏ దిశలో వెళ్ళాలి, ఏ లక్ష్యాలను ఛేదించాలి అనే సూచనలను ఇది నిరంతరం అందిస్తూ ఉంటుంది. సాధారణంగా ‘బోయింగ్ ఈ3 సెంట్రీ’ అనే మోడల్ విమానాన్ని అమెరికా అవాక్స్గా ఉపయోగిస్తుంది.
ఇది భూమి నుంచి ఆకాశం వరకు సుమారు 400 కి.మీ. పైగా పరిధిలోని శత్రువులను గుర్తిస్తుంది. ఇది సేకరించిన సమాచారాన్ని యుద్ధ నౌకలకు, సైన్యానికి, ఇతర యుద్ధ విమానాలకు ఏకకాలంలో చేరవేస్తుంది. శత్రువుల రాడార్లను స్తంభింపజేసే సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఒక్కో అవాక్స్ విమానం తయారీకి దాదాపు 270 మిలియన్ డాలర్లకుపైనే ఖర్చవుతుంది. అందుకే ఈ విమానాన్ని కోల్పోతే.. ఇటు సైన్యం నిఘా సామర్థ్యం దెబ్బతినడంతోపాటు ఆర్థికంగానూ భారీ నష్టాన్ని చవిచూసిట్టు అవుతుంది.