
IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ ( 38 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సులతో 78 పరుగులు), ర్యాన్ రికెల్టన్ ( 43 బంతుల్లో 4 ఫోర్లు 8 సిక్సులతో 81 పరుగులు) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో ముంబైకి విజయాన్ని అందించారు. అంతకు ముందు టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా ఫిల్డింగ్ తీసుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే, రఘువంశీ అర్థ శతకాలతో చెలరేగగా ఫిన్ అలెన్ (37), రింకు సింగ్ (33) మెరుపు బ్యాటింగ్ చేయడంతో కోల్‌కతా భారీ స్కోర్ సాధించింది.
221 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు దంచికొట్టింది. ఒకవైపు రోహిత్ శర్మ, మరోవైపు ర్యాన్ రికెల్టన్ కొట్టే కొట్టుడికి కేకేఆర్ బౌలర్లు వికెట్లు తీయకపోగా పరుగులు ఇవ్వకుండా ఆపేందుకు తెగ ప్రయత్నం చేశారు.. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఎట్టకేలకు రోహిత్– రికెల్టన్ మధ్య 148 పరుగులు భాగస్వామ్యాన్ని వైభవ్ ఆరోరా బ్రేక్ చేశాడు. వైభన్ వేసిన బాల్ ని భారీ షాట్ ఆడబోయిన హిట్ మ్యాన్ అనుకూల్ రాయ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి వెళ్లిపోయాడు.
అనంతరం ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (8 బంతుల్లో 3 ఫోర్లుతో 16 పరుగులు) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కార్తీక్ త్యాగి బౌలింగ్ లో రింకు సింగ్ కి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి చేరుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ రికెల్టన్ రనౌట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన తిలక్ వర్మ (14 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు) కాసేపు బ్యాట్ ఝలిపించిన తర్వాత సునీల్ నరైన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( 11బంతుల్లో 4 ఫోర్లుతో 18 పరుగులు) చివర్లో మెరుపులు మెరిపించడంతో ఘన విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, సునీల్ నరైన్ చెరో వికెట్ పడగొట్టగా, బ్లెస్సింగ్ ముజారబానీ, వరుణ్ చక్రవర్తి, భారీగా పరుగులు ఇవ్వడంతో కేకేఆర్ ఐపీఎల్ తొలి మ్యాచులోనే ఘోర ఓటమిని మూటగట్టుకుంది.