Reading Time: < 1 minute

పుష్కర ఘాట్ల గుర్తింపు కోసం.. టెక్నికల్ ఇంజనీర్ల కమిటీ.. 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం

Caption of Image.
  • పుష్కర పనుల పర్యవేక్షణకు ‘వార్  రూమ్’
  • శాశ్వత పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
  • గోదావరి పుష్కరాలపై సీఎం సమీక్ష

హైదరాబాద్, వెలుగు: పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు వెంటనే టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి 15 నుంచి 20 రోజుల్లో నివేదికను అధికారుల కమిటీకి అందజేయాలని సూచించారు. ఇంజనీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి, పూర్తి అంచనాలతో కూడిన నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి పంపాలని తెలిపారు. కేబినెట్  సబ్  కమిటీ ఆమోదం పొందిన తర్వాత, ఆ ప్రణాళికలకు సంబంధించిన నివేదికపై రాష్ట్ర కేబినెట్  తుది నిర్ణయం తీసుకుంటుందని సీఎం చెప్పారు. 

బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ లో జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాల్సిన పనులపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి రూపొందించిన ప్రణాళికలను అధికారులు పవర్  పాయింట్  ప్రజెంటేషన్  ద్వారా వివరించారు. 

ఈ సందర్భంగా పనుల అమలుకు సంబంధించి అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. పుష్కరాల కోసం చేపట్టే శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యతక్రమంలో పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్ లో ప్రత్యేకంగా ‘వార్ రూమ్’ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. 

ప్రధాన ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల విస్తరణ చేపట్టాలని, భక్తుల సౌకర్యార్థం రోడ్లు, వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ విషయంలో ఫోకస్​ పెట్టాలని సూచించారు. రివ్యూ మీటింగ్​లో బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు సీఎంకు వివరించారు. మాస్టర్ ప్లాన్ పై చర్చించిన సీఎం, అందులో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు. గడువులోగా అన్ని పనులు పూర్తయ్యేలా ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆదేశించారు.

©️ VIL Media Pvt Ltd.