Reading Time: < 1 minute

చీకటి దుప్పటిని తొలగిస్తూ, సూర్యుడు

అపార్ట్మెంట్ కిటికీల సందుల్లోంచి

నగరపు ముఖంపై నీడలువిసిరాడు

పల్లెలోలాగా నెమ్మదిగా కాదు

ఒక అలారం గంటలా!

నగరం ఉలిక్కిపడి మేల్కొంది

కాంక్రీట్ వనంలో, కిలకిలలకంటే ముందే

కంట్రీ యార్డ్ పాల బండ్ల చప్పుడు

న్యూస్ పేపర్ల విసిరివేత

నిశ్శబ్దాన్ని ముక్కలు చేశాయి

మెట్రో పట్టాలు, సిల్వర్ పాముల్లా మెరుస్తూ

వేగాన్ని ఆహ్వానించాయి

పార్కుల్లో, చెమట చుక్కలు

రేపటి లక్ష్యాల కోసం రహదారులపై రాలాయి

టీ కొట్టు దగ్గర, పొగలు కక్కే గ్లాసుల్లో

రాజకీయాలు, వార్తలు వేడివేడిగా

చర్చకు వచ్చాయి

దేవాలయపు గంటల కంటే

ట్రాఫిక్ సిగ్నళ్ళ వెలుగులే

ఇక్కడ మార్గాన్ని చూపుతాయి

అపార్ట్‌మెంట్ ఇరుకు గదుల నుండి

ఒత్తిడిని తరిమే డికాషన్ ఘాటు

మొక్కుబడిగా ముగిసే అగరొత్తి ధూపం..

కలుషిత గాలిలో తమ ఉనికి కోసం

వెతుకులాడుతున్నాయి

ఇక్కడ ప్రతి ఇల్లు ఒక చిన్న

గుడి కావాలని తపిస్తుంది

కానీ, కాలపు వేగంలో ఆ ప్రశాంత పరిమళం..

మెషీన్ల శబ్దాల మధ్య మౌనంగా

మిగిలిపోతుంది

ఆలయ వంటశాల నేతి వాసన బదులు

హోటళ్ల నుండి వచ్చే కాఫీ పరిమళం

గాలిలో ఆధునికతను నింపింది

ప్రతి మనిషి, ఒక సెకనుతో యుద్ధం చేస్తూ

కదిలే యంత్రమై, పరుగు మొదలుపెట్టాడు

పట్టణపు ఉదయం, ఇది ఒక నిరీక్షణ కాదు..

అంతులేని ప్రయాణంలో ఒక

విరామం లేని ఆరంభం!

– విజయ రామ రాజు (ప్రవిరారా)