
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కొనసాగుతున్నప్పటికీ హార్ముజ్జలసంధి దాటి మరో రెండు భారతీయ ఎల్ పీజీ నౌకలు స్వదేశంవైపు ప్రయాణిస్తున్నాయి.బీడబ్ల్యూ టైర్(BW TYR), బీడబ్ల్యూ ఎల్మ్(BW ELM) అనే భారత్ కు చెందిన రెండు నౌకలు దాదాపు 94వేల టన్నుల ఎల్ పీజీ గ్యాస్ తీసుకువస్తున్నాయి. మరో మూడు రోజుల్లో భారత్ తీరానికి చేరుకోనున్నాయి.
అధికారిక ప్రకటన ప్రకారం.. బీడబ్ల్యూ టైర్(BW TYR) మార్చి 31 నాటికి ముంబై చేరుకునే అవకాశం ఉంది. బీడబ్ల్యూ ఎల్మ్(BW ELM) నౌక ఏప్రిల్ 1 నాటికి న్యూ మంగళూరుకు చేరుకోనుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారత్ దౌత్యపరమైన చర్యల ద్వారా హార్ముజ్ జలసంధి ద్వారా ఈ భారత్ నౌకలకు ఇరాన్ అనుమతించింది.
ఇరాన్ గ్రీన్ సిగ్నల్
యుద్దం కారణంగా చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేసింది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మద్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో షిప్పింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే చైనా, పాకిస్తాన్, ఇండియా లాంటి మిత్రదేశాల నౌకల ప్రయాణానికి ఇటీవల ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రతువులు కానీ దేశాల నౌకలు ఈ మార్గం గుండా వెళ్లేందుకు అనుమతిస్తామని ప్రకటించింది.
కొనసాగుతున్న నౌకల రాక
ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, గత కొద్ది రోజులుగా పలు భారతీయ నౌకలు ఈ మార్గం గుండా సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నాయి. మార్చి 26, 28 తేదీల మధ్య, పైన్ గ్యాస్, జగ్ వసంత్ అనే రెండు ఎల్‌పిజి క్యారియర్లు 92వేల టన్నులకు పైగా ఇంధనాన్ని భారత పోర్టులకు చేర్చాయి. అంతకుముంద మార్చి మధ్యలో MT శివాలిక్, MT నందా దేవి నౌకలు గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా పోర్టులకు కూడా భారీ మొత్తంలో గ్యాస్‌ను తీసుకువచ్చాయి. మార్చి 18న ఆయిల్ ట్యాంకర్ జగ్ లాడ్కీ యూఏఈ నుంచి ముంద్రా పోర్టుకు 80వేల టన్నులకు పైగా ముడి చమురును తీసుకువచ్చింది. ఒమన్ నుంచి పెట్రోల్‌ను తీసుకువెళుతున్న మరో నౌక జగ్ ప్రకాష్ జలసంధిని సురక్షితంగా దాటి ప్రస్తుతం టాంజానియాకు వెళ్తోంది.
►ALSO READ | వార్ ఎఫెక్ట్ మామూలుగా లేదుగా.. పెట్రోల్ కష్టాలే అనుకుంటే కండోమ్స్ కొరత కూడానా!
ఇంధన డిమాండ్.. – కొత్త వ్యూహాలు
వంట గ్యాస్ డిమాండ్‌ను తీర్చేందుకు భారత్ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. మన దేశానికి అవసరమైన గ్యాస్‌లో దాదాపు 60 శాతం విదేశాల నుంచే వస్తోంది. అందులో సుమారు 90 శాతం పశ్చిమాసియా దేశాల నుంచే వస్తుంది. దేశీయ వినియోగం ఏటా 33 మిలియన్ టన్నులకు పైగా చేరుకుంటున్న క్రమంలో గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగడం ఎంతో కీలకం. ప్రస్తుత పరిస్థితుల క్రమంలో అమెరికా, అర్జెంటీనా వంటి దేశాల నుంచి కూడా ఎల్‌పిజిని దిగుమతి చేసుకుంటోంది.
పర్షియన్ గల్ఫ్‌లో ఇంకా 18 భారతీయ నౌకలు
పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇంకా 18 భారతీయ నౌకలు ఉన్నాయని అధికారులు ధృవీకరించారు. వీటిలో 485 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ వివాదం ప్రారంభమైన సమయంలో ఆ ప్రాంతంలో 28 భారతీయ నౌకలు ఉండగా.. అప్పటి నుండి ఇప్పటివరకు 8నౌకలు సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి బయటపడ్డాయి. ఎల్‌పిజి క్యారియర్లు ‘జగ్ విక్రమ్’, ‘గ్రీన్ ఆశా’, ‘గ్రీన్ శాన్వి’తో సహా మరికొన్ని నౌకలు జలసంధి పశ్చిమ భాగంలోనే నిలిచిపోయాయి. మరోవైపు ఒక ఖాళీ ట్యాంకర్‌లో ప్రస్తుతం ఎల్‌పిజిని లోడ్ చేస్తున్నారు.
పరిస్థితులను సమీక్షిస్తున్న భారత్
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (DG Shipping) ఎప్పటికప్పుడు పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తోంది. దీని కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తోంది. ఏర్పాటైనప్పటి నుంచి వేలాది కాల్స్, ఇమెయిల్‌లను ఇది పర్యవేక్షించింది. సముద్రయానం చేస్తున్న 940 మందికి పైగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Two LPG carriers, BW Tyr and BW Elm, carrying a combined LPG cargo of about 94,000 MT, have safely transited the region and are moving towards India shores. BW Tyr is proceeding towards Mumbai with an expected time of arrival on 31 March 2026 & BW Elm is en route to New Mangalore… pic.twitter.com/XCLv28H5XE
— ANI (@ANI) March 29, 2026