Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తన స్కాములు, అవినీతి గురించి ప్రశ్నిస్తే సిఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నించిన సందర్భంలో కూడా ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణి ప్రదర్శించారని అన్నారు. రేవంత్ రెడ్డికి బెదిరింపులు అలవాటైపోయాయ ని, అలాంటి బెదిరింపులకు బిఆర్‌ఎస్ ఎప్పటికీ భ యపడదని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్ట్ పేరు తో జరుగుతున్న అవినీతిపై కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీల అమలుకు ఒక్క రూపాయి లేదని చెప్పే సి ఎం, తన అవినీతి సొమ్ముల కోసం మూసీ పేరిట లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని ప్రకటించడం దారుణమని  మండిపడ్డారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 16 వేల కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రణాళికను పక్కన పెట్టి, భారీ అంచనాలతో అవినీతి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్‌వి గ్రేటర్ హైదరాబాద్ విభాగం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బిఆర్‌ఎస్ నేతలు కార్తీక్‌రెడ్డి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం మూసీ నదిలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని మూసీలోకి పంపించే ప్రణాళిక కూడా సిద్ధంగా ఉందని గుర్తు చేశారు.అయినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం అంచనాలను అనవసరంగా పెంచి అవినీతికి మార్గం సుగమం చేస్తోందని విమర్శించారు. మూసీ ప్రాజెక్ట్ పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి, దాదాపు 3000 ఎకరాల భూమిని సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఒకవైపు మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్ట విరుద్ధమని చెప్పే ప్రభుత్వం, అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరి అని పేర్కొన్నారు. మూసీ పేరిట జరుగుతున్న అవినీతి చర్యలను జాతీయ స్థాయి ప్రముఖులు కూడా వ్యతిరేకిస్తున్నారని, గాంధీ కుటుంబ సభ్యులు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు. ఇప్పుడు దేవుడి పేరును ఉపయోగించి ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తాను చేస్తున్న అవినీతి ప్రశ్నిస్తే శివతాండవం చేస్తాను అంటూ సిఎం మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. రేవంత్ రెడ్డి తన అధికార అహంకారాన్ని తగ్గించుకొని, మూసీ ప్రాజెక్ట్‌ను ప్రజలకు ఇబ్బంది కలగకుండా అమలు చేయాలని హితవు పలికారు. లేదంటే లక్షలాది ఇళ్లను కూల్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని హెచ్చరించారు.

రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి లాగా మారిందని కెటిఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో అభయహస్తం పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని అన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు – విద్యా భరోసా కార్డులు, 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్‌సి, ఉర్దూ మీడియం ప్రత్యేక డిఎస్‌సి, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ అమలు కాలేదని తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. తనను కోసినా పైసలు లేవు అంటున్న సిఎం, మూసీ కోసం మాత్రం లక్షల కోట్లు ఉన్నాయని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్ట్‌పై అసలు ప్రణాళికలు లేకుండా, డిపిఆర్ కూడా సిద్ధం చేయకుండా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. బఫర్ జోన్ పేరుతో పేదల ఇళ్లు కూల్చివేస్తూ, పెద్దల ఇళ్లను వదిలేస్తున్నారని, ఇది ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని, మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల జీవితాలను నాశనం చేయడాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇళ్లు కూల్చకుండా, భూములు స్వాధీనం చేసుకోకుండా శాస్త్రీయ పద్ధతిలో మూసీ శుద్ధి చేస్తే బిఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం వేలాది కుటుంబాలు భయాందోళనలో ఉన్నాయని అన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భావోద్వేగ అంశం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ మెదటివారంలో మేధావులు, పర్యావరణ నిపుణులతో రౌండ్ టేండ్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఏప్రిల్ 14 వరకు ప్రతి కాలేజీ, ప్రతి బస్తీలో ప్రచారం చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. వెంటనే తాళాలు తీసి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. లేకపోతే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా వేలాది మందితో వెళ్లి తాళాలు బద్దలుకొట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పేదల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కెసిఆర్ ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగాలని బిఆర్‌ఎస్‌వి శ్రేణులకు పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం చేపట్టే పోరాటానికి పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని కెటిఆర్ తెలిపారు.