
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుమ్కక్కు ఆయ్యారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అందుకే కెటిఆర్‌పై ఉన్న అవినీతి కేసుల జోలికి పోవడం లేదని అన్నారు. కెటిఆర్‌కు, కవితకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. కేవలం హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తూ కాళేశ్వరంలోని కొంత భాగం అవినీతిపై మాత్రమే మాట్లాడుతున్నారని చెప్పారు.
కాళేశ్వరంలో జరిగిన రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరిపితే మొత్తం బండారం బయపటపడుతుందనే భయంతోనే అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ అవినీతిపైనే విచారణను పరిమితం చేశారని ఆయన ఆరోపించారు. హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండాలని కెటిఆర్‌కు సీఎం సలహా ఇస్తున్నారని ఆయన అన్నారు. కాళేశ్వరంపై హరీష్‌పై ఉన్నంత పగ కెటిఆర్‌పై ముఖ్యమంత్రికి లేదన్నారు. భవిష్యత్తులో బిఆర్‌ఎస్ తో కలిసి పోటీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వంద శాతం కెటిఆర్, రేవంత్ రెడ్డి ఒక్కటేనని ఆయన తెలిపారు.