
ఉలెన్‌బాటర్: తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీ).. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం సిద్ధమైంది. సోమవారం నుంచి జరిగే ఈ పోటీల్లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గతేడాది నవంబర్ తర్వాత తొలిసారి ఇంటర్నేషనల్ రింగ్‌లోకి దిగుతున్న నిఖత్.. రాబోయే కామన్వెల్త్ గేమ్స్ (జులై–ఆగస్ట్), ఆసియా క్రీడలు (సెప్టెంబర్–అక్టోబర్), వరల్డ్ బాక్సింగ్ ఫైనల్స్ వంటి కీలక టోర్నీలకు నేరుగా అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన బాక్సర్లకు చాన్స్ ఉంటుంది. దాంతో ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మంగోలియా వాతావరణానికి అలవాటు పడేందుకు ఇండియా బాక్సర్లు గత 15 రోజులుగా చైనా, జోర్డాన్, థాయ్‌లాండ్ బాక్సర్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఒలింపిక్ విజేత లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీ), మీనాక్షి హుడా (48 కేజీ), జైస్మిన్ లంబోరియా (57 కేజీ) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత చాంపియన్‌షిప్‌లో పతకం సాధించలేకపోయిన మెన్స్ టీమ్ ఈసారి ఆ లోటును భర్తీ చేయాలని భావిస్తోంది. వరల్డ్ కప్ విన్నర్ జాదుమణి సింగ్ (55 కేజీ), సచిన్ సివాచ్ (60 కేజీ), నరేందర్ బెర్వాల్ (90+) పతకాలపై కన్నేశారు.
హితేష్ గులియా, అవినాష్ జమ్వాల్ ఈ టోర్నీకి ఎంపిక కాలేదు. వాళ్ల స్థానంలో దీపక్ (70 కేజీ), ఆదిత్య ప్రతాప్ యాదవ్ (65 కేజీ) బరిలో ఉన్నారు. చైనా, చైనీస్‌తైపీ, కజకిస్తాన్, జపాన్, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ జట్ల నుంచి బలమైన బాక్సర్లు బరిలో ఉండటంతో పోటీ రసవత్తరంగా సాగనుంది.