Reading Time: < 1 minute

ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం అమానవీయం.. గద్దర్ పై కాల్పులు జరిపినవారిని  ఇంకా గుర్తించలేదు: ప్రొ. కోదండరాం

Caption of Image.

 పంజాగుట్ట, వెలుగు: సమాజంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం అమానవీయమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రజా గొంతుక గద్దర్ పై కాల్పులు జరిపిన నిందితులను నేటికీ గుర్తించకపోవడం విడ్డూరమని ఆయన విమర్శించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వారు లేకుంటే పాలించేవారిదే రాజ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి జీవీ సూర్యకిరణ్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 6న ‘ప్రశ్నించే గొంతుకలు సాధించిన విజయాలు’ అనే థీమ్​తో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. గద్దర్ పై కాల్పులు జరిపిన నిందితులను వెంటనే గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆల్ మాల స్టూడెంట్ జేఏసీ అధ్యక్షులు మందాల భాస్కర్ మాట్లాడుతూ.. గద్దర్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశంలో గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, రాజ్యాంగ పరిరక్షణ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, అంబేద్కర్ సంఘం నాయకులు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.