Reading Time: 2 minutes
Rohit Sharma Breaks Kohli Record Ipl Mi Vs Kkr 2026

Rohit Sharma records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై హార్దిక్ పాండ్యా జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ర్యాన్ రికెల్టన్ 43 బంతుల్లో 81 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 38 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు బాదడం విశేషం. దీంతో కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19.1 ఓవర్లలోనే ఛేదించింది. కాగా.. ఈ తొలి మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ పలు రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 50వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ (72), డేవిడ్ వార్నర్ (66), శిఖర్ ధావన్ (53) తర్వాత ఈ మైలురాయిని అందుకున్న నాలుగో బ్యాటర్‌గా అరుదైన క్లబ్‌లో చేరాడు. అంతేకాదు.. ముఖ్యంగా ఈ మ్యాచ్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును బద్దలు కొట్టారు. ఐపీఎల్‌లో ప్రత్యర్థి జట్టుపై అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. కేకేఆర్‌పై ఇప్పటివరకు రోహిత్ 1161 పరుగులు (డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ తరపున కలిపి) సాధించి, పంజాబ్ కింగ్స్‌పై కోహ్లీ చేసిన 1159 పరుగుల రికార్డును అధిగమించాడు. ఛేజింగ్‌లో రోహిత్, ర్యాన్ రికెల్టన్ కలిసి మొదటి వికెట్‌కు 148 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ చరిత్రలో ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం గమనార్హం.

READ MORE: KKR vs MI : ముంబై ఇండియన్స్ చారిత్రాత్మక విజయం.. 14 ఏళ్ల నిరీక్షణకు తెర.!

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది పాండ్యా సేన. కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ బరిలోకి దిగింది. సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానే (67), అంగ్‌క్రిష్ రఘువంశీ (51) అర్ధ సెంచరీల సాయంతో 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యం చాలా పెద్దదే అయినప్పటికీ, రోహిత్ శర్మ తనదైన టైమింగ్, పవర్‌తో లక్ష్యాన్ని ఈజీగా ఛేజ్ చేశారు. చివరికి అనుకుల్ రాయ్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినా, అప్పటికే ముంబై ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించే స్థితికి చేరుకుంది.