Reading Time: < 1 minute

వెలుగుమట్లలో యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు: మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

Caption of Image.
  •     మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు: వెలుగుమట్ల భూదాన్  భూముల్లో అన్ని సౌలతులతో మోడల్  కాలనీ నిర్మించి పేదలకు గౌరవప్రదమైన వాతావరణం కల్పిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్  భూముల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్  అనుదీప్  దురిశెట్టి, సీపీ సునీల్ దత్, మున్సిపల్  కమిషనర్  అభిషేక్  అగస్త్య, అడిషనల్​ కలెక్టర్  పి. శ్రీనివాస్​రెడ్డితో పరిశీలించారు. కలెక్టర్  మ్యాప్  ద్వారా వివరాలు తెలియజేశారు. కాలనీలో ఇప్పటికే విద్యుత్  పోల్స్​ ఏర్పాటు, స్ట్రీట్​లైట్​ పనులు పూర్తయ్యాయని, వాటర్  ట్యాంక్  నుంచి ఇంటింటికీ తాగునీటి పైప్‌‌లైన్  ఏర్పాటు చేశామని తెలిపారు. 

అంతర్గత రోడ్ల నిర్మాణం, రవాణా సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజల అవసరాలను తీర్చాలని, ప్రతి ఫ్యామిలీకి తాగునీరు, విద్యుత్, రోడ్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పదేండ్లుగా పేదలు సరైన సౌలతులు లేక ఇబ్బంది పడ్డారని, తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని తెలిపారు. కాలనీలో స్కూల్, కమ్యూనిటీ హాల్, పార్క్  ఏర్పాటు చేస్తామన్నారు. నెలలోగా డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని, వర్షాకాలంలో కాలనీలో సమస్య రాకుండా చూడాలన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్  రాయల నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్  హనుమంతరావు, ఆర్అండ్​బీ ఎస్ఈ యాకుబ్, హౌసింగ్  పీడీ భూక్యా శ్రీనివాస్, పబ్లిక్  హెల్త్  ఈఈ రంజిత్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్లు డి జయచందర్, సైదులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.