Reading Time: < 1 minute

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మరింత వేడెక్కాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం బిజెపి తరఫున రాష్ట్రంలోని మమత బెనర్జీ సారధ్య టిఎంసి ప్రభుత్వంపై ఛార్జీషీట్ విడుదల చేశారు. బెంగాల్ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే పరిమితం అయినవి కావు. ఇది దేశ భద్రత సమగ్రతకు సంబంధించిన విషయం అయిందని తెలిపారు. ఎన్నికల దశలో బిజెపి తరఫున ఆయన జోరు పెంచారు. ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అమిత్ షా మమత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 15 సంవత్సరాలుగా సాగుతున్న టిఎంసి సర్కారు హయాంలో పలు అక్రమాలు జరిగాయని విమర్శించారు. ప్రత్యేకించి టిఎంసి ప్రభుత్వ వైఖరితో దేశంలోకి అక్రమ వలసలు ముమ్మరం అయ్యాయని ఆరోపించారు. ఇప్పుడు ఈ ప్రాంతం చొరబాట్ల ముఖద్వారం అయిందని విమర్శించారు. బిజెపి ఛార్జీషీట్‌లో సంబంధిత విషయాలను ప్రస్తావించామని వివరించారు.

టిఎంసి ప్రభుత్వ బుజ్జగింపుల రాజకీయాలు, అవినీతి, రాజకీయ హింసాకాండతో పరిస్థితి దారుణంగా మారిందని ఆరోపించారు. ప్రత్యేకించి దేశ భద్రతకు సవాలు విసిరేలా చొరబాట్ల వ్యవహారం మారిందని అమిత్ షా చెప్పారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యవహారశైలి చివరికి అరాచక వీధిరౌడి స్థాయికి మారింది. ఇటువంటి ధోరణిని వెంటనే నీరుగార్చి తీరాల్సి ఉందన్నారు. పైగా మమత దీదీ ఎప్పుడూ తాను దాడులకు దిగుతూ , రాజకీయ బాధితురాలు డ్రామాలకు దిగుతారు. ఒక్కోసారి ఆమె తనకు తగలని గాయాలను చూపుతూ సానుభూతికి ప్రయత్నిస్తారు. ఎన్నికల సంఘంపై తిట్లకు దిగుతారు. ఇప్పుడు ఈ మహానుభావురాలి కపట నీతి గురించి బెంగాలీలందరికీ తెలిసిపోయింది. ఆమె తరచూ బాధితురాలనే డ్రామాలో ప్రధాన పాత్రధారి అని గుర్తించారని చెప్పారు. టిఎంసి మైనార్టీ ఓటుబ్యాంకు రక్షణకు ఆమె ఎన్నికల సంఘం చేపట్టిన సర్‌ను వ్యతిరేకించారని చెప్పారు.