Reading Time: < 1 minute

హైదరాబాద్‌ బేకరీల్లో ఏం కొని తినాలన్నా భయపడేలా చేస్తున్నారుగా.. ఈ బేకరీలో ఏం జరిగిందో చూడండి !

Caption of Image.

హైదరాబాద్: హైదరాబాద్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న బేకరీపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. గోల్కొండ టాస్క్ ఫోర్స్, గుడిమల్కాపూర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో కేడీ కాలనీలో నడుస్తున్న అక్రమ బేకరీ యూనిట్ను పోలీసులు బట్టబయలు చేశారు. అనుమతులు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో తయారీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ.. నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్న నిందితుడు అహ్మద్ రజాపై కేసు నమోదు చేశారు. మైదాపిండి, చక్కెర, పామాయిల్, నెయ్యి వంటి రూ. 12 లక్షల 54 వేల 280 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. భారీగా నిల్వ చేసిన బిస్కెట్లు, రస్కులు, బటర్ బన్స్, ఓస్మానియా, కాజు, చాయ్, ఫ్యాన్ బిస్కెట్లను, తయారీ యంత్రాలను అధికారులు సీజ్ చేశారు.

హైదరాబాద్ నగరంలోని కిరాణా షాపులు, హోటళ్లు, కేఫ్‌లకు నాసిరకం ముడి పదార్థాలతో తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తూ.. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిపై గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్‌లో పలు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

►ALSO READ | హార్ముజ్ గుండా మరో రెండు భారత్ నౌకలు… ఓడల భద్రతకు నౌకాదళం సహాయం

ఈ ఆపరేషన్లో గోల్కొండ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసుల సమన్వయంతో తనిఖీలు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హైద్రాబాద్లో అక్రమ ఆహార ఉత్పత్తులను తయారుచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

©️ VIL Media Pvt Ltd.