Reading Time: < 1 minute

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ సునీల్ నరైన్ నయా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన తమ ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా ప్లేయర్ సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్ నెలకొల్పిన ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. 

2012లో లీగ్‌లోకి అరంగేట్రం చేసినప్పటి నుండి నరైన్ నైట్ రైడర్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. 2012లో కేకేఆర్‌లో చేరిన అతను, తన మిస్టరీ స్పిన్‌తో తక్షణమే తనదైన ముద్ర వేశాడు. 2012, 2014లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. పొదుపైన బౌలింగ్, విధ్వంసకర బ్యాటింగ్ తో రాణిస్తూ కెకెఆర్ కు కీలకంగా మారాడు. ఈ క్రమంలో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్ రికార్డును నరైన్ బ్రేక్ చేశాడు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్ అతనికి 190వ మ్యాచ్. దీంతో ఐపిఎల్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. పొలార్డ్ 189 మ్యాచ్ లు ఆడి ఈ జాబితాలో రెండోస్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్(184), డేవిడ్ వార్నర్(184), డీజే బ్రావో(161)లు ఉన్నారు.