
మద్యానికి బానిసై నిత్యం తల్లి, చెల్లిని వేధిస్తున్నాడనే ఆక్రోశంతో తండ్రిని హతమార్చాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని బాయిమీది తండాలో జరిగింది. శనివారం తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పెద్దేముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాయిమీది తండాకు చెందిన రాథోడ్ లోక్యనాయక్(50), బిక్కిబాయి దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో మద్యం చిచ్చురేపింది. మద్యానికి మద్యానికి బానిసైన లోక్యనాయక్ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. మద్యానికి బానిసైన లోక్యనాయక్ తరుచుగా మద్యం సేవించి భార్య బిక్కిబాయి, చిన్నకుమార్తె సుప్రియను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తన భార్య బిక్కిబాయి, కుమార్తె సుప్రియను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని తల్లి బిక్కిబాయి తక్షణమే హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటు జీవనం సాగిస్తున్న కుమారుడు రాథోడ్ సునీల్(34)కు ఫోన్‌లో సమాచారం చేరవేశారు. దీంతో సునీల్ నాయక్ ఆక్రోశంతో స్వగ్రామం బాయిమీది తండాకు చేరుకున్నాడు.
తన తల్లి బిక్కిబాయి, చెల్లెలు సుప్రియను వేధిస్తున్న విషయంపై తండ్రి లోక్యనాయక్‌ను మాట్లాడాడు. ఈ క్రమంలో ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. మాటమాట పెరుగడంతో ఆగ్రహానికి గురైన రాథోడ్ సునీల్ నాయక్ తన ఇంట్లో ఉన్నటువంటి గొడ్డలితో తండ్రి లోక్యనాయక్ మెడ, దవడ, తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. దీంతో లోక్యనాయక్ రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్, సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి తల్లి హేమ్లీబాయి ఫిర్యాదు మేరుకు పోలీసులు 58/2026 యూ/ఎస్ 103(1) బీఎన్‌ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు నిందితుడు రాథోడ్ సునీల్ నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కోర్టులో హజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.