
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై విచారణ జరుపుతామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కానీ ఈ ప్రకటనలు అసెంబ్లీ ప్రసంగాలకే పరిమితం కాకూడదని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. గతంలో ప్రకటనలపై యాక్షన్ ఎక్కడని శనివారం ట్వీట్ చేశారు. 2024 అసెంబ్లీ సమావేశాల్లో ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణకు సిట్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని సంజయ్ గుర్తు చేశారు. ఆ సిట్ ఇప్పుడెక్కడుందని, విచారణలో ఏ నిజాలు బయటపడ్డాయని నిలదీశారు. ఇప్పుడు మళ్లీ అదే అసెంబ్లీ వేదికగా గ్రానైట్ అక్రమాలపై విచారణ జరుపుతామని రేవంత్ సర్కారు చెబుతోందని, పాత అనుభవాలను చూస్తుంటే.. ఈ కొత్త ప్రకటనను ప్రజలు ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు.
ఫండ్స్ కోసం బ్లాక్ మెయిల్ తంత్రమా..?
కేరళ, తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిధుల కోసం అసెంబ్లీ వేదికగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారా అని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరలేపగా.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని వాడుకుని అదే సంస్కృతిని కొనసాగిస్తున్నారన్నారు. నిజంగా అక్రమాలను వెలికితీయాలనే చిత్తశుద్ధి ఉంటే.. తక్షణమే విచారణకు ఆదేశించి, ఆ ప్రక్రియ మొత్తాన్ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. గ్రానైట్ కంపెనీల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న వారిని బయటపెట్టాలని కోరారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే విచారణకు ఒక స్పష్టమైన డెడ్ లైన్ విధించాలని, బాధ్యతాయుతమైన ఆఫీసర్లను నియమించి లోతుగా దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి సూచించారు.