
మన తెలంగాణ/ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచే ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మితమవుతున్న ఎలివేటెడ్ కారిడార్‌కు “ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కారిడార్”గా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్. నెం.104పై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు బండారి రాజిరెడ్డి సేవలను స్మరించుకుంటూ ఈ నామకరణం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందించాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. మాట్లాడుతూ తమ కుటుంబానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీతో దాదాపు 50 సంవత్సరాల అనుబంధం ఉందని తెలిపారు. తమ తల్లి మల్లాపూర్ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ తరఫున వార్డ్ సభ్యురాలిగా పనిచేసి ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. తమ అన్నగారు కీర్తిశేషులు బండారి రాజిరెడ్డి కాప్రా మున్సిపల్ చైర్మన్‌గా, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ తరఫున దీర్ఘకాలం సేవలందించారని తెలిపారు.
2019లో మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయం కోసం బండారి రాజిరెడ్డి అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. 2014లో తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. 2023లో బిఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట చంద్రశేఖర రావు ఆధ్వర్యంలోని ఆ పార్టీ తరఫున తనకు టికెట్ లభించిందని తెలిపారు. తమ అన్న కాంగ్రెస్ పార్టీకి, ఉప్పల్ నియోజకవర్గానికి అందించిన సేవలను గుర్తించి, ఈ ఎలివేటెడ్ కారిడార్‌కు ఆయన పేరు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి తమ కుటుంబ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.