Reading Time: < 1 minute

మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం భగవత్ కార్యంగా భావిస్తున్నానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారని, ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమమని, ముచుకుంద నదికి గొప్ప చరిత్ర ఉందని ఆయన తెలిపారు. 8 ఎకరాల్లో 700 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని ఆయన అన్నారు. మూసీనది పునరుజ్జీవిం గురించి చాలా మంది ప్రయత్నించారని, కారణాలు ఏవైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదని, ఆ అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.

విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే వాటిని తొలగిస్తారని, తెలంగాణ పౌరులకు తన విజ్ఞప్తి ఒక్కటేనని, చరిత్రను గమనిస్తే నది పరీవాహకంలోనే నాగరికత అభివృద్ధి చెందిందని, సముద్ర పరీవాహకంలో వ్యాపారం, ఆర్ధిక అభివృద్ధి జరిగిందని సిఎం అన్నారు. దేశంలో సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, మూసా, ఈసా నదులు ఉన్నా సరైన విధంగా ఉపయోగించుకోలేదని, మానవ తప్పిదాలతోనే మూసీ కాలుష్య కారకంగా మారింది గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.