
తెలంగాణ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాల ప్రారంభంపై స్పీడ్ పెంచింది. తాజాగా మరో కొత్త పథకాన్ని లాంచ్ చేసింది. తొలి ముద్ద పేరుతో చిన్నారులకు పౌషకాహారం అందించేందుకు కొత్త స్కీమ్‌ను ప్రారంభించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా చిన్నారులకు రోజూ బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు. పిల్లలకు పోషకాహారం అందించేందుకు, పోషకాహారలేమితో బాధపడకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెచ్చిన ఈ పథకం వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.
తొలిముద్దం పథకం ఏంటి..?
పిల్లలకు పోషకాహారం అందించేందుకు తొలిముద్ద పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకాన్ని రేవంత్ ప్రారంభించారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కింద అంగన్‌వాడీల్లో పిల్లలకు ఉప్మా, కిచిడీ అందిస్తారు. మిక్స్ బ్రేక్‌ఫాస్ట్‌గా వీటిని ఇవ్వనున్నారు. ఈ పథకాన్ని సమర్దవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలదేనని, వారిపై ఈ బాధ్యత ఉందని రేవంత్ తెలిపారు. ఈ సందర్బంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఉచిత మొబైల్ ఫోన్లను కూడా పంపిణీ చేశారు. పిల్లలకు పౌష్టికాహారం అందిస్తేనే వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని, అందుకే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ తీసుకొచ్చామన్నారు. సరైన ఆహారం పిల్లలకు అందకపోవడం వల్లనే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. తొలిముద్దం పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు.
సొంత భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు
ఇక సొంత భవనాల్లోనే అంగన్‌వాడీ కేంద్రాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సొంత భవనాలు నిర్మించేలా ప్రణాళికలు రచించాలని సూచించారు. అంగన్వాడీ పిల్లలను సొంత కుటుంబసభ్యుల్లా భావించాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేవారిని కన్నబిడ్డల్లా చూసుకోవాలని రేవంత్ పేర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యర్తలను తమ ప్రభుత్వం సొంత కుటుంబసభ్యుల్లా భావిస్తోందని తెలిపారు.