Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును వేగవం తం చేసేందుకు కీలక అడుగు వేసింది. ప్రాజెక్టు ప్రణాళిక, సమన్వయం, అమలును పర్యవేక్షించేందుకు ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు జీఓ నెం.406ను విడుదల చేశారు. ఈ కేబినెట్ సబ్ కమిటీకి డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహారించనున్నారు. సభ్యులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహారించన్నారు.

సమావేశానికి హాజరుకానున్న మూడు జిల్లాల కలెక్టర్‌లు

మూసీనది పునరుజ్జీవనం, మురుగునీటి నిర్వహణ, వరద నివారణ, రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై విధానపరమైన మార్గదర్శకాలను కేబినెట్ సబ్ కమిటీ అందించనుంది. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించి, ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు సమీక్షించనుంది. అదేవిధంగా భూసేకరణ, పునరావాసం, నిధుల సమీకరణ వంటి కీలక అంశాలపై తగిన నిర్ణయాలు తీసుకోనుంది. ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా ఈ కేబినెట్ సబ్ కమిటీ పర్యవేక్షించనుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు అమల్లో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండిలు సైతం ఈ కమిటీ సమావేశాలకు హాజరుకానున్నారు.