
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ధళపతి విజయ్ సిద్ధమవుతున్నారు. త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తమిళగ వెట్రి కళగం (టివికె) నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విజయ్ విడుదల చేశారు. ఇక విజయ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు.
చెన్నైలో జరిగిన సభలో విజయ్ ఈ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మొత్తం 234 స్థానాల్లో టివికె పోటీ చేయనుంది. విల్లివాక్కం నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అర్జున పోటీ చేయనున్నారు. తన అభ్యర్థులు ప్రజా రక్షకులుగా విజయ్ అభివర్ణించారు. వారు రాజకీయ దిగ్గజాలు కాదని.. ప్రజలకు జవాబుదారీగా ఉంటారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమకు, సిఎం నేతృత్వంలోని డిఎంకె మధ్యే అసలైన పోటీ ఉంటుందని తెలిపారు.
‘విజిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నా. గెలిచిన తర్వాత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయం. అవినీతికి పాల్పడం. మహిళలకు భద్రత కల్పిస్తాం. మాదకద్రవ్యరహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతాం. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించం’ అని విజయ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం.. టివికెకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.