Reading Time: < 1 minute

 ఐపిఎల్ 2026ను బెంగళూరు ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడా విజయం సాధించి బోణీ కొట్టింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 69 (38 బంతులు; 5×4, 5×6), దేవ్‌దత్ పడిక్కల్ 61(26 బంతులు; 7×4, 4×6)లు అర్ధ శతకాలతో చెలరేగగా.. సారథి రజత్ పాటిధర్(31) సయితం మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో 201 పరుగుల భారీ లక్షాన్ని కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి, 15.4 ఓవర్లలోనే ఛేదించి విజయానందుకుంది బెంగళూరు. సన్ రైజర్స్ బౌలర్లలో డెవిడ్ పెయిన్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టగా..

జైదేవ్ ఉనద్కట్, హర్ష్ దూబె తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 80 (38 బంతులు; 8×4, 5×6 ) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అనికేత్ వర్మ 43 (18 బంతులు; 3×4, 4×6 ), హెన్రీచ్ క్లాసెన్(31) దూకుడుగా రాణించడంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో జాకో డఫీ(3/22), రొమారియో షెఫెర్డ్(3/54) మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.

శుభారంభం దక్కలేదు..

విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ పేలవ ఫామ్‌ను ఐపిఎల్ 2026 సీజన్‌లోనూ కొనసాగించాడె. ఆ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపర్చాడు. 8 బంతుల్లో ఒక సిక్సర్‌తో 7 పరుగులే చేసి వెనుదిరిగాడు. జబోబ్ డఫీ వేసిన మూడో ఓవర్‌లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. జాకోబ్ డఫీ వేసిన షార్ట్ బాల్‌ను అభిషేక్ శర్మ పుల్ షాట్ ఆడబోయాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా.. కీపర్ జితేష్ శర్మ పరుగెత్తి క్యాచ్ తీసుకున్నాడు. దాంతో సన్‌రైజర్స్ 18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఇదే ఓవర్ ఆఖరి బంతికి ట్రావిస్ హెడ్(11) సయితం క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. నితీశ్ కుమార్ రెడ్డి(1), సలీల్ అరోరా(9) కూడా రాణించలేక పోయారు.