
హైదరాబాద్ లో కల్తీ దందా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసిరకం సరుకులు విడుస్తూ జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కల్తీ రాయుళ్లు. ఇప్పటికే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొదలుకొని.. బేకరీ ఐటమ్స్, బ్రాండెడ్ సరుకుల వరకు ప్రతిదీ కల్తీ అవుతున్న క్రమంలో నగరవాసులు బయటి తిండి తినాలంటేనే వణికిపోయే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు హైదరాబాద్ శివారులోని మైలార్ దేవ్ పల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకివచ్చాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి…
మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడా ప్రాంతంలో ఉన్న అరుణ్ కుమార్ కలర్ ఫుడ్స్ తయారీ చేస్తున్నట్టు గుర్తించారు మైలారదేవ్ పల్లి పోలీసులు. పోలీసుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రజలు రోజువారీ కొనే మిక్చర్ వంటి స్నాక్స్ ఐటమ్స్ లో నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశంపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు అధికారులు.
►ALSO READ | వికారాబాద్ జిల్లాలో అక్రమ డీజిల్ దందా.. ట్యాంకర్ సీజ్ చేసిన పోలీసులు
ఈ దాడుల సందర్భంగా రంగులు కలిపిన మిక్చర్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అదనంగా చేకోడీలు, నూనె నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. స్నాక్స్ తయారీ కోసం వాడే నూనె నల్లగా కందెనలా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు.తయారీ కేంద్రానికి సంబంధించిన అనుమతులు, నాణ్యత ప్రమాణాలు, తయారీ విధానాలపై కూడా అధికారులు వివరాలు సేకరించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.