Reading Time: < 1 minute

బుద్ధవనం అద్భుత కళాఖండం : శ్రీలంక మంత్రి హిణిడుమ సునిల్ సెన్వి

Caption of Image.
  •     శ్రీలంక మంత్రి   హిణిడుమ సునిల్  సెన్వి
  •     బుద్ధ వనం సందర్శించిన ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధులు

హాలియా, వెలుగు: బుద్ధవనం ప్రపంచంలోనే అద్భుత కళాఖండమని శ్రీలంక బౌద్ధ మత సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునిల్ సెన్వి కొనియాడారు. ప్రపంచ శాంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లోని  బుద్ధవనాన్ని ఆయనతో పాటు ప్రపంచంలోని 22 దేశాలకు చెందిన 100 మంది బౌద్ధ ప్రతినిధుల బృందం సందర్శించింది. బుద్ధవనంలోని విభాగాలను, బుద్ధుడి జీవిత ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలను, ధ్యాన కేంద్రాలను వారు ఆసక్తిగా పరిశీలించారు. ప్రొఫెసర్లు, బౌద్ధ భిక్షువులు, బౌద్ధ నిపుణులు బుద్ధవనం చేరుకోగా ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధులకు టిబెట్ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. బుద్ధ వనంలో బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం మహాస్తూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించి ధ్యానం చేశారు. అనంతరం లాంచీలో నాగార్జునకొండ మ్యూజియం చేరుకొని పునర్నిర్మించిన  అశ్వమేధ యజ్ఞశాల, గౌతమ బుద్ధుడి ధాతువులు లభ్యమైన మహాస్తూపం, శ్రీలంక దేశానికి సంబంధించిన సింహాల విహారాన్ని సందర్శించారు. 

ఈ సందర్భంగా శ్రీలంక మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బుద్ధవనం నిర్వహించిన సదస్సు ద్వారా ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇవ్వడం హర్షణీయమన్నారు. సదస్సులో తాను పాల్గొనడం సంతృప్తి ఇచ్చిందన్నారు. యుద్ధ సమయంలో ఇటువంటి శాంతి సదస్సులు నిర్వహించడం మంచి పరిణామమని కొనియాడారు. భారతదేశానికి శ్రీలంకకు గతంలోనే మైత్రి సంబంధాలు ఉన్నాయని వాటిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. ప్రముఖ బౌద్ధ గురువు వియత్నాం బౌద్ధ సంఘం ఉపాధ్యక్షుడు తోచ్ నట్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, మిర్యాలగూడ సబ్  కలెక్టర్  నారాయణ అమిత్, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, టూరిజం మాజీ సీఎండీ చెన్నూరు ఆంజనేయ రెడ్డి, తెలంగాణ టూరిజం ఏజీఎం జంగయ్య ఉన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.