Reading Time: < 1 minute

నింపాదిగా నిలబడి ఉంటాను

ఏ శబ్దమూ నేర్పకుండానే, నన్నుచదివేస్తున్న

నిశ్శబ్ద విస్తృతిని ఎదుర్కొని.. ఇక్కడ కాలానికి గడియారం లేదు

దూరానికి అంచులు లేవు

మనసులో పేరుకుపోయిన

అనవసర బరువులన్నీ స్వయంగా వదిలిపోతాయి

ఒకే రంగులో, వేల భావాల్ని దాచుకున్న

ఈ అగాధం బోధించదు, భయపెట్టదు

కేవలం మనలోకి మనల్నే చూడమంటుంది

ఎన్ని శ్రమల్ని మోసుకొచ్చినా తన ముఖంపై ఒక్క చిన్న

మడత కూడా పడనివ్వని, ఆ స్థైర్యమే నాకు నిత్యపాఠం

ఇక్కడ, ఆక్రమణ లేదు, అంగీకారమే ఉంది

ఓటమి లేదు, విస్తరణ మాత్రమే ఉంది

నేను మాట్లాడితే చిన్నబోతానని

ఇది నన్ను మౌనంలోకి తీసుకెళ్తుంది

మౌనమే పెద్దగా మాట్లాడుతుందని నాకు అర్థమయ్యేలా..

ఇది దృశ్యం కాదు, ఉపమానమూ కాదు..

మనిషి ఎంత చిన్నవాడూ, అదే సమయంలో

ఎంత విస్తరించగలడో, నిర్భయంగా గుర్తు చేసే ఒక నీలి సత్యం..

– డాక్టర్ పెరుగు రామకృష్ణ