
నేను, నా సాహితీ యాత్ర: జ్వలిత కలం పేరు. ఇది సోకు కోసం పెట్టుకున్నది కాదు. వివక్షను ఎదుర్కోడానికి అవసరార్థం ఎంచుకున్నది. అమ్మానాన్నలు పెట్టింది విజయ కుమారి దెంచనాల. మాది ఉమ్మడి ఖమ్మం జిల్లా, గార్ల మండలం, పెద్ద కిష్టాపురం గ్రామం. చేతివృత్తుల కుటుంబం. నాన్న దెంచనాల బ్రహ్మయ్య పంచదాయిల పనులు చేసిన నిరుపేద నిపుణుడు. నాన్న పట్టుదల వల్లనే నేను, అక్కా చదువుకోగలిగాము. మా సామాజిక వర్గం లో మా కుటుంబాల్లో మేము మొదటి తరం అక్షరాస్యులం. మా అమ్మ ఈశ్వరమ్మ ఆడపిల్లల చదువు కు వ్యతిరేకి కాదు. పెళ్లయిన తర్వాత, ఇద్దరు పిల్ల లు పుట్టిన తర్వాత, హైదరాబాద్‌లో ఇంటర్మీడియ ట్ లేకుండానే చదివిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సెకండ్ బ్యాచ్ మాది. 1987 డీగ్రీ చేశాను. తర్వాత M.A (తెలుగు), M.Sc (సైకాలజీ), M.Ed, L.L.B పూర్తిచేసి 15 సంవత్సరాలు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసాను. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినే! బిఈడి, ఎల్.ఎల్.బీ ఒకే విద్యా సంవత్సరంలో చేశాను. ఎంఏ తెలుగు కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుండే. 1994 డీఎస్సీ ద్వారా ప్రభుత్వ టీచరుగా సత్తుపల్లిలో ఉద్యోగం మొదలుపెట్టి 2017లో ఖమ్మంలో రిటైర్ అయ్యాను. తెలంగాణ ఉద్యమంలో, బీసీ ఉద్యమంలో, తెలంగాణ విద్యావంతుల వేదికలో, తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం లో, మట్టిపూలు, రుంజ, టీమాస్ వంటి సంస్థలలో బాధ్యురాలిగా పనిచేసాను.
ఇప్పుడు నేను ‘బహుళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక పత్రిక (2021)ను నడుపుతున్నాను. జేడీ పబ్లికేషన్స్ పేరుతో 2020 నుండి ప్రచురణలు చేస్తున్నాను. ‘సాహితీ వనం మిద్దెతోట’ పేరుతో టెర్రస్ గార్డెన్ సాగు 2018నుండి చేస్తున్నాను. రసాయన ఎరువులు వాడను. సేంద్రియ ఎరువుల ను నేనే తయారు చేసి వాడతాను. మిద్దెతోట సాగు గురించి, సేంద్రియ ఎరువుల తయారీ గురించి అవసరమైన వారికి సలహాలు, కౌన్సెలింగ్ ఇస్తుంటాను. కథా సాగరం యూట్యూబ్ ఛానల్ 2019లో మొదలుపెట్టాను. (కథయిత్రుల కథాపఠనం వీడియోలను భద్రపరిచే ప్రాజెక్టు) చేస్తున్నాను. 202223 తెలంగాణ కథల సేకరణ చేశాము. తెలంగాణ అకాడమీ ఈ కథల్ని ప్రచురిస్తోంది. రస్కిన్ బాండ్ షార్ట్ స్టోరీస్ ఆంగ్లం నుండి తెలుగులోకి అనువాదం చేస్తున్నాను.
ఇప్పటి వరకు పన్నెండు స్వీయ రచనలు ప్రచురించాను. నాలుగు కవితా సంపుటులు, మూడు కథల పుస్తకాలు, ఒక వ్యాసాల పుస్తకం, రెండు నవల లు, ఒక అనువాద కథల పుస్తకం.కవిత్వ సంపుటాలు కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి (తెలంగాణ ఉద్యమ కవి త్వం), సంగడి ముంత వచ్చాయి. కథా సంపుటాలు ఆత్మాన్వేషణ, రూపాంతరం, ఎన్నెల, ఇవే కాకుండా నాల్గవ కథల పుస్తకం కూడా వస్తున్నది. వ్యాస సంపుటి జ్వలితార్ణవాలు (సాహిత్య సామాజిక వ్యాసాలు) వచ్చాయి. ఎర్ర రంగు బుర ద, నవల- గతంలో తరుణిలో సీరియల్‌గా వచ్చిం ది. ఒడిపిళ్ళు నవల తరుణి అంతర్జాల పత్రికలో సీరియల్‌గా వస్తోంది. అనువాద కథలు, ముజఫర్ నగర్‌లో దీపావళి (తనూజ్ సోలంకి కథలు ఇంగ్లీష్ నుండి తెలుగు, అనువాద కథల సంపుటిని అన్వేక్షికి వారు ప్రచురించారు.
నా రచనలు ఆంగ్లంలోకి సైతం అనువాదమయ్యా యి. Murder prolongare – 2008, (‘సుదీర్ఘ హత్య’ ఆంగ్లానువాదం ప్రముఖ వైద్యులు డా.ఎల్. ఎస్.ఆర్.ప్రసాద్ గారు కొన్ని, మెట్టు రవీందర్ గారు మరికొన్ని అనువాదం చేశారు. Wounded Lives-2021లో ‘సంగడిముంత’ ఆంగ్లానువాదం స్వాతి శ్రీపాద గారు చేశారు. Blue Roses publications వారు ప్రచురించారు. Redmire- 2024లో వచ్చిన ‘ఎర్ర రంగు బురద’ ఆంగ్లానువాదం స్వాతి శ్రీపాద గారు చేశారు. అలాగే ‘ఎర్రరంగు బురద’ నవల కన్నడ అనువాదం ఎస్.డి.కుమార్ గారు చేశారు. సప్తగిరి పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. సంఘటిత కన్నడ అనువాదం ఎస్.డి కుమార్ గారు చేశారు.
నేను సంపాదకత్వం వహించిన సంకలనాలు పదిహేను ఉన్నాయి. అవి పరివ్యాప్త (స్త్రీవాద కవిత్వం), గాయాలే గేయాలై -సహసంపాదకీ యం – తెలంగాణ స్త్రీల కవిత్వం, రుంజ విశ్వకర్మ కవుల కవిత్వం, ఖమ్మం కథలు (1911-2016వరకు 104 సంవత్సరాల, ఖమ్మం జిల్లా 104మంది రచయితల 104 కథలు), అక్షర పుష్పాలు – భావ సౌరభాలు, ఖమ్మం బాల కవుల రచనల సంకల నం, పోరు-జ్వలిత సాహిత్య సంక్షిప్త సమాలోచన, పూల సింగిడి, బతుకమ్మ కవిత్వంకి సహ సంపాదకత్వం, అవలోకనం, కరోనా డైరీ (126మంది రచయితల డైరీ) 2020 గల్పికాతరువు (104 ఒక పేజీ గల్పికలు), లేఖావలోకనం (పసి పిల్లలపై లైంగిక హింసను ఖండిస్తూ 65మంది లేఖల సంకలనం), విముక్తి, సిస్టర్ అనసూయ- నవల, సంఘటిత(201021 స్త్రీవాద కవిత్వం) మల్లెసాల- (శతాధిక చేతవృత్తి కథల సంకలనం), కొత్త చూపు- మహిళా కథల సంకలనం.
బీసీలు అణచి వేయబడుతున్నారు. అంబేడ్కర్ మనుస్మృతి చదివితేనే కదా దాన్ని తగలబెట్టగలిగాడు. రచయితతో పాఠకుడు ఏకీభవించాల్సిన అవసరం లేదు. కానీ రచనల్లో జ్ఞానాన్ని సమర్జించుకోవడానికి పాఠకుడు నిజాయితీగా, నిష్పక్షపాతంగా చదవాలి.. రచయితలు రాసేది, కూసేది, చేసేది ఒకటే ఉండాలి కానీ ప్రస్తుతం అలా లేదు. రచయితను చంపేసేటటువంటి విమర్శ ఉండకూడదు. అస్తిత్వ వాదాలను కెరియజం మింగేసింది. ఉన్నదంతా డొల్లతనమే. పిచ్చి రాతలు రాయడం కంటే పెన్ను మూయడమే సరైనది.
– జ్వలిత