Reading Time: < 1 minute

కేరళలో కాంగ్రెస్ కూటమి (యూడిఎఫ్) విజయం ఖాయమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార అండ్ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలో వచ్చే నెల 9వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడిఎఫ్) స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన పతనంతిట్ట జిల్లా లోని అడూర్ అసెంబ్లీ నియోజకవర్గం యూడిఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి శాంతకుమార్ (కాంగ్రెస్ పార్టీ) మద్దతుగా వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూటమి పట్ల ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి సాధించిన విజయాలు దీనికి నిదర్శనమన్నారు. గత దశాబ్దంగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, ప్రజలకు అందిన ఫలితాలు తక్కువగా ఉన్నాయని ఆయన విమర్శించారు. పదేళ్ల పాలన తర్వాత కూడా నిరుద్యోగం పెరుగుతుంటే, ప్రజలపై ఆర్థిక భారాలు అధికమవుతుంటే – అది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సెక్యులర్ విలువలను కాపాడే శక్తి కాంగ్రెస్‌కే ఉందని, ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పుతో కాంగ్రెస్ కూటమికి విజయం అందిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.