
టెక్నాలజీ మనిషి జీవితాన్ని సులభతరం చేయాలి. కానీ అదే టెక్నాలజీ మనిషి మెదడును తన గుప్పిట్లోకి తీసుకుని బానిసను చేస్తే? సరిగ్గా ఇదే అంశంపై కాలిఫోర్నియా జ్యూరీ ఇచ్చిన తీర్పు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా వ్యసనానికి మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), యూట్యూబ్ వంటి సంస్థలే బాధ్యత వహించాలని కోర్టు స్పష్టం చేస్తూ, 6 మిలియన్ డాలర్ల జరిమానా విధించడం ఒక చారిత్రాత్మక పరిణామం. సోషల్ మీడియా అనేది కేవలం సమాచార మార్పిడి వేదిక మాత్రమే కాదు, అదొక పకడ్బందీగా రూపొందించబడిన ‘డిజిటల్ సైకాలజీ’. వినియోగదారుడు యాప్‌ను క్లోజ్ చేయకుండా నిరంతరం స్క్రోల్ చేస్తూనే ఉండేలా చేసే ‘ఇన్‌ఫైనైట్ స్క్రోలింగ్’, ఆటో-ప్లే ఫీచర్లు యాదృచ్ఛికంగా వచ్చినవి కావు. అవి యూజర్ల మెదడులో డోపమైన్ విడుదలను ప్రేరేపించి, వారిని ఒక రకమైన మత్తులోకి నెట్టేలా డిజైన్ చేయబడ్డాయి. ఈ ఉచ్చులో పడి పసిపిల్లలు తమ సహజత్వాన్ని కోల్పోతున్నారు.
ఇప్పటివరకు సోషల్ మీడియా వినియోగాన్ని వ్యక్తిగత అలవాటుగా మాత్రమే చూశాం. ఫోన్ ఎక్కువగా చూస్తున్నారు అంటే వారి తప్పే అని భావించాం. కానీ ఈ తీర్పు ఆ ఆలోచనను పూర్తిగా మార్చేసింది. వినియోగదారుల బలహీనతలను గుర్తించి, వారిని ఎక్కువసేపు యాప్‌లలోనే ఉంచేలా రూపొందించిన ఆల్గారిథమ్స్ కూడా ఒక కారణమని కోర్టు స్పష్టం చేసింది. అంటే ఇది కేవలం వినియోగదారుడి తప్పు మాత్రమే కాదు.. ఇది వ్యవస్థపరమైన సమస్య. సోషల్ మీడియా కంపెనీలు రూపొందించిన ఆటోప్లే, ఇన్‌ఫినిట్ స్క్రోలింగ్, నిరంతర నోటిఫికేషన్లు వంటి ఫీచర్లు సాధారణ సాంకేతిక సౌకర్యాలు కావు. అవి మన దృష్టిని బంధించే పద్ధతులు. మన మెదడు డోపమైన్‌పై ఆధారపడేలా చేసే ఒక మానసిక వ్యూహం. ఇది వినోదం పేరుతో వ్యసనాన్ని పెంచే డిజైన్. అందుకే నిపుణులు దీన్ని డిజిటల్ సైకాలజీగా పేర్కొంటున్నారు.
ఇక్కడ ముఖ్యంగా ఆందోళన కలిగించే విషయం పిల్లలపై పడుతున్న ప్రభావం. చిన్న వయస్సులోనే సోషల్ మీడియా వినియోగం ప్రారంభమవుతోంది. వాస్తవ ప్రపంచంతో పోల్చితే వర్చువల్ ప్రపంచమే వారికి నిజమైన జీవితం అనిపించే స్థితి వస్తోంది. అందం అంటే ఏమిటి? విజయం అంటే ఏమిటి? సంబంధాలు అంటే ఏమిటి? అన్న భావనలు కూడా సోషల్ మీడియా ప్రభావంతో మారిపోతున్నాయి. దీని ఫలితంగా ఆందోళన, ఒంటరితనం, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. కాలిఫోర్నియా కోర్టు తీర్పు ఈ సమస్యను వ్యక్తిగత స్థాయి నుంచి సామాజిక స్థాయికి తీసుకువచ్చింది. ఇది ఇక ఒక కుటుంబ సమస్య కాదు. ఇది ఒక ప్రజారోగ్య సమస్య. పొగాకు కంపెనీలపై గతంలో వచ్చిన తీర్పుల మాదిరిగా, ఇప్పుడు సోషల్ మీడియా కంపెనీల బాధ్యతపై కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. ఇది ఒక కొత్త దిశలో ప్రారంభమైన మార్పు.
అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. మొత్తం బాధ్యత కంపెనీలదేనా? వినియోగదారుల బాధ్యత ఏమిటి? తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? సమాధానం సులభం కాదు. కానీ స్పష్టమైన విషయం ఏమిటంటే.. ఇది ఒక సంయుక్త బాధ్యత. కంపెనీలు తమ ప్లాట్‌ఫారమ్‌లను బాధ్యతాయుతంగా రూపొందించాలి. ప్రభుత్వాలు నియంత్రణ చట్టాలు తీసుకురావాలి. తల్లిదండ్రులు పిల్లల డిజిటల్ అలవాట్లపై పర్యవేక్షణ చేయాలి. ముఖ్యంగా వినియోగదారులు తమ సమయాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. ఈ తీర్పు మరో ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తోంది. సాంకేతికత మన కోసం ఉండాలి.. మనపై ఆధిపత్యం కోసం కాదు. మన జీవితం సులభతరం చేయడానికి వచ్చిన సాధనాలు మన జీవితాన్ని నియంత్రించే స్థాయికి చేరుకుంటే, అది అభివృద్ధి కాదు. అది ప్రమాద సంకేతం. ఇప్పుడు ప్రపంచం ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. సోషల్ మీడియా భవిష్యత్తు ఎలా ఉండాలి? అది లాభాల కోసం పనిచేసే యంత్రంగానే కొనసాగాలా? లేక సమాజానికి మేలు చేసే బాధ్యతాయుత వేదికగా మారాలా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. ఈ నేపథ్యంలో భారతదేశం వంటి యువ జనాభా అధికంగా ఉన్న దేశాలకు ఈ తీర్పు ఒక ముఖ్యమైన హెచ్చరికగా పరిగణించాలి.
ఇప్పటికే మన దేశంలో చిన్న వయస్సు పిల్లల నుంచి కాలేజీ యువత వరకు సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. రోజుకు గంటల కొద్దీ ఫోన్‌లకు పరిమితమవుతున్న జీవితం వారి చదువు, వ్యక్తిత్వ వికాసం, మానసిక ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతున్నది. అయితే ఇప్పటివరకు దీనిని ఒక సామాన్య జీవనశైలి మార్పుగా మాత్రమే చూస్తున్నాం గానీ, ఒక ప్రజారోగ్య సమస్యగా చర్చించలేదు. ఇప్పుడు ఆ దిశగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రత్యేకంగా పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ వినియోగంపై అవగాహన కల్పించడం అత్యంత అవసరం. పిల్లలకు సోషల్ మీడియా ప్రయోజనాలు మాత్రమే కాకుండా ప్రమాదాల గురించి కూడా చెప్పాలి.
అదే సమయంలో ప్రభుత్వం కూడా వయస్సు పరిమితులు, డేటా రక్షణ, ఆల్గారిథమ్ పారదర్శకత వంటి అంశాలపై కఠినమైన విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో పలు దేశాలు ఇప్పటికే ఈ దిశగా చర్యలు ప్రారంభించాయి. భారత్ కూడా వెనుకబడకూడదు. సోషల్ మీడియాను పూర్తిగా నిరాకరించడం సాధ్యం కాదు, అవసరమూ కాదు. కానీ దాన్ని నియంత్రణలో ఉంచే సామాజిక బాధ్యతను మాత్రం విస్మరించలేము. కాలిఫోర్నియా కోర్టు తీర్పు ఇచ్చిన సందేశం స్పష్టంగా ఒకటే.. సాంకేతికత మనిషి జీవితాన్ని మెరుగుపరచాలి గానీ, మనిషిని తన ఆధీనంలోకి తీసుకోవడానికి కాదు. ఈ సత్యాన్ని గుర్తించే సమాజమే భవిష్యత్తులో ఆరోగ్యకరమైన డిజిటల్ సంస్కృతిని నిర్మించగలదు. కాలిఫోర్నియా కోర్టు తీర్పు ఒక కేసుకు మాత్రమే సంబంధించినది కాదు. ఇది డిజిటల్ యుగానికి ఇచ్చిన హెచ్చరిక. మనం ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే, డిజిటల్ డ్రగ్ అనే పదం, పెను ముప్పుగా మారే ప్రమాదం పొంచి ఉంది.
– ముద్దం నరసింహస్వామి
– 99498 39699