
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. బడ్జెట్ పై చర్చను అడ్డుకున్నందుకు ఈ సెషన్ ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అలాగే ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది అసెంబ్లీ .
కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ
కడియం శ్రీహరిని గన్ తో కాల్చి పడేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైగలు చేశారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉండేలా చర్యలు ఉండాలన్నారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తను సమర్థిస్తే అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయన్నారు. కౌశిక్ ప్రవర్తను సుమోటోగా తీసుకుని ఎథిక్స్ కమిటీ ఆధారంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ రూల్ ప్రకారం కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. కౌశిక్ రెడ్డి ప్రవర్తను కేటీఆర్, హరీశ్ సమర్థిస్తారా అని ప్రశ్నించారు రేవంత్ . కడియం నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. అనంతరం కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు శాసన సభ వ్యవహారల మంత్రి శ్రీధర్ బాబు.