
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే వెన్నునొప్పి కారణంగా మహేంద్ర సింగ్ ధోనీ మొదటి రెండు వారాల పాటు ఆటకు దూరం కానుండగా, ఇప్పుడు మరో కీలక ఆటగాడు కూడా గాయపడటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ గాయం (సైడ్ స్ట్రెయిన్) కారణంగా ఈ సీజన్ మొదటి 2 లేదా 3 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.
రేపు (మార్చి 30న) గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌తో పాటు ఏప్రిల్ 3వ తేదీన పంజాబ్ కింగ్స్, ఏప్రిల్ 5న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లకు బ్రెవిస్ దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. బ్రెవిస్ కంటే ముందే సీఎస్‌కేకి బౌలర్ నాథన్ ఎల్లిస్ కూడా గాయంతో ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక డేవాల్డ్ బ్రెవిస్ స్థానంలో మాథ్యూ షార్ట్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభించగా, షార్ట్ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే అతను ఆఫ్-స్పిన్ బౌలింగ్ కూడా చేస్తాడు.
►ALSO READ | IPL 2026: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్
ఇక 2022లో ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన డెవాల్డ్ బ్రెవిస్, 2025 సీజన్ మధ్యలో రూ. 2.2 కోట్లకు సీఎస్‌కే జట్టులో చేరాడు. 2022 అండర్-–19 ప్రపంచ కప్‌లో బ్రెవిస్ 506 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన శిఖర్ ధావన్ (505 పరుగులు) రికార్డును అతను అధిగమించాడు. కాగా ధోనీ, ఎల్లిస్, బ్రెవిస్ వంటి కీలక ఆటగాళ్లు ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడం రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై జట్టుకు పెను సవాలుగా మారింది. రాబోయే మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ లాంటి బలమైన జట్లను చెన్నై ఎలా ఎదుర్కొంటుందో అనేది వేచి చూడాలి.