
పినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన హీరో విజయ్ ఆదివారం తమ తమిళగ వెట్రికజగం (టివికె) పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఎప్రిల్ 23వ తేదీన జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. సొంతంగా ఆయన పార్టీ మొత్తం 234 అసెంబ్లీ స్థానాల నుంచి పోటికి దిగుతుంది. కాగా తాను ఇప్పటి తమిళనాడు రాజకీయాలలో ప్రత్యామ్నాయ శక్తిని అవుతానని చెప్పిన విజయ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటికి దిగుతారు. ఎన్నికల రంగంలో తొలిసారి రంగ ప్రవేశం చేసే విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి, చెన్నైలోని పెరంబూర్ నుంచి బరిలో నిలుస్తారు. ఈ రెండు స్థానాలలో డిఎంకె తమ బలీయమైన అభ్యర్థులు ఆర్‌డి శేఖర్, ఇనిగో ఇరతయరాజ్‌ను ఇప్పటికే నిలిపింది. చెన్నైలోని ఓ ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్ తమ పార్టీ జాబితాను విడుదల చేశారు.
రెండు స్థానాల నుంచి సి జోసెఫ్ విజయ్ నిలుస్తున్నారని అభిమానులు , పార్టీ నేతల చప్పట్ల మధ్య ప్రకటించారు. ఈ సందర్బంగానే పార్టీ అభ్యర్థులను పరిచయం చేశారు. ఇందులో తన అత్యంత ప్రధాన విశ్వసనీయ వ్యక్తుల బృందంలోని వారు కూడా ఉన్నారు. ఇటీవల అన్నాడిఎంకె నుంచి పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి కు ప కృష్ణన్‌కు లాల్గూడి సీటు కేటాయించారు. అదే విధంగా డిఎంకె ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా టికెట్లు దక్కాయి. ఇప్పుడు తాము ప్రకటిస్తున్నది అభ్యర్థులను కాదని, ప్రజా పరిరక్షకులను అని తెలిపారు. యువతరం కదలాల్సి ఉందని, జన్ జడ్‌తోనే సరికొత్త విజిల్ వెలువడుతుందని తమ పార్టీ గుర్తును ప్రదర్శించారు. యువతకు ప్రత్యేకంగా అజెండాను వెలువరించారు. గ్యారంటీగా ప్రకటించారు. తమిళనాడును డ్రగ్స్ రహితం చేస్తామని, సరళరీతిలో రుణాలు ఇస్తామని విద్యావకాశాల కోసం ఇంటర్ నుంచి పిహెచ్‌డి వరకూ రూ 20 లక్షల వరకూ రుణాలు అందిస్తామని వివరించారు.