
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ రెండో మ్యాచ్‌లో బిగ్ ఫైట్ కి రంగం సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) టీమ్స్ పోటీ పడనున్నాయ. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకి ఇది సొంత మైదానం కావడంతో ఎంఐ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ మ్యాచ్ కేవలం ఒక గేమ్ మాత్రమే కాదు.. ముంబై ఇండియన్స్‌కు 14 ఏళ్ల శాపాన్ని విముక్తి చేసుకునే ఒక అవకాశంగా చెప్పాలి. వాంఖడేలో తమకున్న వరస్ట్ రికార్డును తుడి చేసేందుకు కేకేఆర్ చూస్తుంది.
ముంబైకి 14 ఏళ్ల శాపం:
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సక్సెస్ ఫుల్ జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. కానీ, ఈ జట్టుని ఒక విచిత్రమైన రికార్డు గత 14 సంవత్సరాలుగా వేధిస్తోంది. ఐపీఎల్ సీజన్ లో ఆడే ఫస్ట్ మ్యాచ్ లో ముంబై ఓడిపోవడం.. ఆ టీమ్ 2012లో తొలిసారి ఐపీఎల్ లోని మొదటి మ్యాచ్‌ను గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సీజన్ లోనూ తొలి మ్యాచ్ లో ఓటమితోనే టోర్నీని ప్రారంభిస్తుంది. ఇప్పుడు 2026లో తన హోం గ్రౌండ్ లో ఆడుతున్న ముంబై.. ఆ 14 ఏళ్ల చెత్త రికార్డును తుడిచేసేందుకు కంకణం కట్టుకుంది. హార్థిక్ పాండ్యా ఆధ్వర్యంలోని టీమ్ ఈసారి పక్కా ప్లాన్ తో తుది పోరుకి దిగుతుంది.
కేకేఆర్కు అగ్నిపరీక్ష:
ముంబైకి ఫస్ట్ మ్యాచ్ గండం ఉంటే, కేకేఆర్ కు వాంఖడే గండం ఉంది. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడేలో కోల్‌కతా రికార్డు అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ ముంబైతో ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేకేఆర్ కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. అందులో ఒకటి 2012లో రాగా, రెండోది 2024లో దక్కింది. అంటే వాంఖడేలో ముంబైని కొట్టడం కేకేఆర్ కు తలకు మించిన భారంగా మారుతోంది. అజింక రహానే నేతృత్వంలోని కేకేఆర్ టీమ్ ఈ రికార్డును మార్చి, ముంబైకి షాక్ ఇవ్వాలని చూస్తోంది.
►ALSO READ | IPL 2026: KKR vs Mi మధ్య హైటెన్షన్ పోరు.. వాంఖడే పిచ్ రిపోర్ట్ ఇదే
కేకేఆర్ ట్రంప్ కార్డ్:
ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగే మ్యాచ్ లో అందరి దృష్టిని న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ ఆకర్షించబోతున్నాడు. 2026 క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు అతని పేరుపైనే ఉంది. కేవలం 16 ఇన్నింగ్స్‌ల్లోనే ఏకంగా 50 సిక్సులు కొట్టాడు. కేకేఆర్ ఫ్రాంచైజీ అతడిని కేవలం రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. అలెన్ ని తీసుకోవడం ఈ సీజన్ లోనే బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. ఓపెనర్‌గా బరిలోకి దిగే ఫిన్ అలెన్ గనుక వాంఖడేలో సెట్ అయితే, ముంబై ఇండియన్స్ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం.
కీలక పోరుకు సిద్ధమైన ప్లేయర్స్:
ముంబై జట్టులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్ బ్యాటర్లు ఉంటే.. కేకేఆర్ లో సునీల్ నరైన్, క్వింటన్ డికాక్, ఆండ్రీ రస్సెల్ లాంటి పవర్ హిట్టర్లు ఉన్నారు. ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తుంది కాబట్టి, ఈ మ్యాచులో పరుగుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తుంది. రోహిత్ శర్మ తన ఫేవరెట్ స్టేడియంలో ఎలా ఆడతాడు? నరైన్ మ్యాజిక్ స్పిన్ ముంబై బ్యాటర్లను కట్టడి చేస్తాందా? అనే అంశాలు మ్యాచ్ ఫలితంపై ప్రత్యేకమైన బజ్ ని క్రీయేట్ చేస్తున్నాయి.