
- ఏప్రిల్ 1 నుంచి షాపుల మూసివేస్తామని హెచ్చరిక
మల్కాజిగిరి, వెలుగు: పౌల్ట్రీ రంగంలో కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని మల్కాజిగిరి చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో వ్యాపారులు మాట్లాడుతూ.. ఫారం నుంచి రిటైల్ మార్కెట్ వరకు కార్పొరేట్ కంపెనీలు ధరలను నియంత్రిస్తూ, మార్జిన్లు తగ్గించడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని మండిపడ్డారు.
గత ఆరు నెలలుగా చికెన్ ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల చికెన్ షాపులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని తెలిపారు. ‘నష్టాలు మాకు.. లాభాలు మీకా?’ అంటూ కంపెనీల తీరును ఎండగట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేసి నిరవధిక సమ్మెకు దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.