
- నివాసయోగ్యంగా ఉంటే చాలు.. ఫ్లోరింగ్, వైరింగ్ లేకున్నా కంప్లీషన్ కిందకే..
- గృహప్రవేశాలు చేసుకునేలా నిబంధనలు సడలించిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తూ నిబంధనలను సడలించింది. ఇల్లు వంద శాతం పూర్తి కాకపోయినా.. నివాసయోగ్యంగా ఉంటే చాలు తుది విడత బిల్లులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ.గౌతమ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో అమలులో ఉన్న రూల్స్ ప్రకారం.. ఇంటి ఫ్లోరింగ్, లోపలి ప్లాస్టరింగ్, పూర్తిస్థాయి ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి ఫినిషింగ్ పనులు పూర్తయితేనే కంప్లీషన్ స్టేజ్ ఫొటోలను లబ్ధిదారులు అప్‌లోడ్ చేసే వీలుండేది. ఆ తర్వాతే ప్రభుత్వం బిల్లులు రిలీజ్ చేసేది. అయితే, నిరుపేద లబ్ధిదారులు ఆర్థిక స్థోమత లేని కారణంగా ఈ చిన్న చిన్న పనులను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారని, ఫలితంగా తుది విడత బిల్లులు నిలిచిపోతున్నాయని సర్కారు గుర్తించింది. వారు త్వరగా గృహప్రవేశం చేసుకునేలా నిబంధనలను సరళతరం చేసింది.
సవరించిన నిబంధనలు ఇవే..
- ఫ్లోరింగ్ అవసరం లేదు : ఇంటి లోపల ఫ్లోరింగ్(నేల) పని పూర్తి కాకపోయినా బిల్లులు ఆపకూడదు. లబ్ధిదారులు తమ ఆర్థిక స్థోమతను బట్టి తర్వాత దీన్ని పూర్తి చేసుకోవచ్చు.
- ప్లాస్టరింగ్ : ఇంటి వెలుపలి ప్లాస్టరింగ్ పూర్తయితే చాలు. లోపలి వైపు ప్లాస్టరింగ్ లేకున్నా తుది విడత బిల్లు మంజూరు చేస్తారు.
- తలుపులు, కిటికీలు : లోపలి గదులకు తలుపులు లేకపోయినా పర్వాలేదు. కేవలం ఇంటి ప్రధాన ద్వారం(ఎక్స్‌టర్నల్ డోర్) ఉంటే సరిపోతుంది.
- పెయింటింగ్: బయటి వైపు వైట్ వాష్/పెయింటింగ్ ఉంటే చాలు. రెండో కోట్ పెయింటింగ్ నిబంధనను తొలగించారు.
- వైరింగ్, ప్లంబింగ్ : పూర్తిస్థాయి వైరింగ్ లేకపోయినా, తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ ఉన్నా సరిపోతుంది. టాయిలెట్, ఫ్యాన్ బిగించడం వంటి ప్లంబింగ్ పనులు తప్పనిసరి కాదు.
అమలుకు కలెక్టర్లకు ఆదేశాలు
రూల్స్ లో చేసిన మార్పులకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ.గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది కేవలం ఇంటి నిర్మాణ పటిష్టత(స్టక్చరల్ కంప్లీషన్)పై దృష్టి పెట్టాలని, చిన్న చిన్న హంగుల కోసం బిల్లులు ఆపవద్దని సూచించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా తుది దశలో ఉన్న వేలాది ఇండ్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు మార్గం సుగమమైంది.