
Pakistan: పాకిస్థాన్ జాతీయ విమానయాన సంస్థ (PIA) తన చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, ఏ క్షణమైనా ఈ సంస్థ తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి, బోర్డు తిప్పేసే ప్రమాదం పొంచి ఉంది. దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని వారాలుగా పాకిస్థాన్‌లో విమాన ఇంధన (Jet Fuel) ధరలు ఆకాశాన్నంటాయి. ఎటువంటి ముందస్తు అధికారిక ప్రకటన లేకుండానే, ప్రభుత్వం నిశ్శబ్దంగా దాదాపు 150 శాతం మేర ధరలను పెంచడం గమనార్హం. మార్చి 1న లీటరు జెట్ ఇంధనం (JP-1) ధర రూ.190 కాగా, మార్చి 21 నాటికి అదే ఇంధనం ధర ఏకంగా రూ.472కి చేరింది. కేవలం మార్చి 21 ఒక్కరోజే లీటరుపై రూ.84 (సుమారు 21.65%) పెరగడం గమనార్హం. ఈ భారీ భారం విమానయాన సంస్థల ద్వారా నేరుగా సామాన్య ప్రయాణికులపై పడనుంది, దీనితో విమాన ప్రయాణం సగటు మనిషికి అందని ద్రాక్షలా మారబోతోంది.
READ ALSO: Fire Accident : మణికొండలో అగ్నిప్రమాదం.. అల్కాపూర్ టౌన్‌షిప్‌లో చెలరేగిన మంటలు
ప్రస్తుత విపత్కర పరిస్థితులపై పీఐఏ (PIA) కన్సార్టియం ఛైర్మన్ ఆరిఫ్ హబీబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “జెట్ ఇంధన ధరలు ఇలాగే పెరుగుతూ పోతే, విమానయాన సంస్థను నడపడం అసాధ్యం. పరిస్థితి అదుపులోకి రాకపోతే పీఐఏను మూసివేయవలసి వస్తుంది” అని కుండబద్దలు కొట్టారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ అధిపతి నుంచి ఇలాంటి ప్రకటన రావడం ఆ దేశ ఆర్థిక స్థితిగతులకు అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా అమెరికా – ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణమే ఈ ఇంధన ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతినడంతో ఇంధన కొరత ఏర్పడి, ధరలు నియంత్రణ లేకుండా పెరుగుతున్నాయన్నారు.
READ ALSO: Chiru158: మెగాస్టార్ సినిమాలో మాఫియా బ్యాక్‌డ్రాప్.. బాబీ కొల్లి ‘నెక్స్ట్ లెవల్’ ప్లాన్!