
మన తెలంగాణ/హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి తమ ప్రభుత్వం వరకు జరిగిన ఇసుక, మైనింగ్‌పై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. సిబిసిఐడి ఇచ్చే నివేదికను వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చకు కూడా పెట్టనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ గండి పడినా, ఖనిజ సంపద దోపిడీకి గురైనా తాము చూస్తూ ఊరుకోబోమని, అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ఖజానాకు గండి కొడుతూ సాగే అక్రమ మైనింగ్‌ల పట్ల తమ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోందని సీఎం స్పష్టం చేశారు. శాసనసభలో శనివారం పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ పక్షం ఉప నాయకుడు హరీశ్‌రావు మాట్లాడుతూ,రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుగల సంస్థ మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడుతోందని, అది మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిందని ఆరోపించారు.
ఆ కంపెనీతో మంత్రికి ఏం సంబంధం లేకపోయినా కేవలం సదరు మంత్రిని ఎదుర్కొలేక మంత్రికి అంటగడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్ వెంకటస్వామి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ మంత్రి పొంగులేటిపై వచ్చిన ఆరోపణలపై సభా కమిటీ వేయాల్సిందేనని బీఆర్‌ఎ స్ సభ్యులు డిమాండ్ చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ, , రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై తమకు ఎవరు ఫిర్యాదు చేయకపోయినప్పటికీ ప్రభుత్వమే స్పందించి దానికి నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి స్పందించినప్పటికీ బీఆర్‌ఎస్ సభ్యులు హౌస్ కమిటీ వేయాల్సిందేనని పట్టుబట్టడాన్ని ప్రస్తావిస్తూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం (జూన్ 2, 2014) నుంచి తమ ప్రభుత్వంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని మైనింగ్ తవ్వకాలపై వచ్చిన ఆరోపణలపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తోన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన హరీశ్‌రావు సోదరుడు మహేశ్వర్‌రావు ఇసుకదందాతో పాటు సిరిసిల్లలో ఇసుక మాఫియా మొదలుకొని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు చెందిన కంపెనీలతో తాజా రాఘవ కన్స్ట్రక్షన్ వరకు ఆరోపణలు వచ్చిన అన్నింటిపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని సీఎం వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు ఆ నివేదిక పెడుతామని అన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై మా ప్రభుత్వమే వివరాలు తీసుకుని చర్యలు తీసుకుందని, ఈ సంస్థతో మంత్రికి సంబంధం లేకపోయినప్పటికీ కే వలం మంత్రిపై బురద చల్లాలని, వాళ్ల పైరవీలకు సహకరించడం లేదని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తు న్నారని, వాళ్ల బ్లాక్ మెయిల్ లకు ప్రభుత్వం లొంగదని, సిబిసిఐడి విచారణ జరిపించి నిజాలు నిగ్గు తెలుస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిం చారు.
మంత్రి సంస్థకు నిబంధనలు వర్తించవా? హరీశ్‌రావు
బీఆర్‌ఎస్ ఉప నాయకుడు టి హరీశ్‌రావు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ‘కంచే చేను మేసినట్లు’ ఉన్నాయని విమర్శించారు. రక్షకులే భక్ష కులుగా మారుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని ఆరోపించారు. తాను చేసే ప్రతి ఆరోపణకూ ప్రభుత్వ డాక్యు మెంట్లే సాక్ష్యమని, ఏ ఒక్క మాట కూడా గాలిలో మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఎటువంటి అనుమ తులు లేకుండా, నిబంధనలను బేఖాతరు చేస్తూ మైనింగ్ వ్యాపారాలు దర్జాగా సాగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్న మనం రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసాను కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ‘తెలంగాణ స్టోన్ క్రషర్ రూల్స్ 2025’ నిబంధనలను తుంగలో తొక్కి, నగర పరిసరాల్లో డీజిల్ జనరేటర్ల సహాయంతో క్రషర్లు నడుపుతు న్నారని, ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన ’రాఘవ కన్‌స్ట్రక్షన్స్’ సంస్థ నడుపుతోన్న అక్రమ మైనింగ్ వ్యవహారమని హరీష్ రావు విరుచుకుపడ్డారు.
తమ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు చిన్న తప్పు చేస్తే ఆయనను రాత్రికి రాత్రే అరెస్ట్ చేసి నెల రోజులు జైల్లో పెట్టారని, మరి పొంగులేటి సంస్థపై ఎందుకు చర్యలు లేవు? ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయమా?‘ అని హరీశ్‌రావు నిలదీశారు.రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మైనింగ్ అక్రమాలు, అవకతవకలపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి లేదా హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని తన సొంత సంస్థకు లబ్ధి చేకూరుస్తున్నారని, దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను బిఆర్‌ఎస్ సభ్యులు ఒక దశలో వెల్‌లోకి దుసుకవచ్చి అడ్డుకున్నారు. వారి తీరుపై అధికార పక్షం తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేసింది. సభా సమయాన్ని వృథా చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. గందరగోళం మధ్యే సభను అదుపులోకి తెచ్చేందుకు స్పీకర్ ప్రయత్నించినప్పటికీ, బీఆర్‌ఏస్ సభ్యులు వినిపించుకోకుండా పెద్ద పెట్టునా నినాదాలు చేశారు.
బీఆర్‌ఎస్ నిరసన.. భట్టి విక్రమార్క సీరియస్
రోడ్లపై అల్లరి చేసినట్లు బీఆర్‌ఎస్ సభ్యుల తీరు ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. వెల్‌లోకి వచ్చి చప్పట్లు కొడుతూ నిరసన వ్యక్తం చేయడం ఇదెక్కడి సంప్రదాయం? పవిత్రమైన సభలో చిన్నపిల్లలాట లాంటి ఈ వ్యవహారం ఎక్కడిదన్నారు. మీరు చేసిన ఆరోపణలన్నీ వాస్తవం అనుకుంటే ఎలా? అని భట్టి ప్రశ్నించారు. ప్రతిపక్ష బాధ్యతతో మీరు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. చట్ట ప్రకారం ఎలా వెళ్లాలో అలా ముందుకు వెళ్తుందన్నారు.
ఇది సభా సంప్రదాయం కాదు : మంత్రి శ్రీధర్‌బాబు
ఒకరిని టార్గెట్ చేస్తూ వ్యక్తి గత విమర్శలు చేయడం సభా సాంప్రదాయం కాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. అభూత కల్పనలతో అందర్నీ తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. హరీష్‌రావు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులు ఆరోపణలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేరు రికార్డుల నుంచి తొలిగించాలని కోరారు. సభా స్థానంలో ఉన్న ప్యానల్ స్పీకర్ బాల్‌నాయక్ మంత్రి పేరును రికార్డుల నుంచి తొలగిస్తోన్నట్టు ప్రకటించారు.