
ఈ ఏడాది జరిగిన టి-20 ప్రపంచకప్‌కి భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. ఈ మెగా ట్రోర్నీలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి భారత్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ టి-20 వరల్డ్ కప్‌కి సంబంధించిన కేసులో ముంబైకి చెందిన క్రికెటర్ అరెస్ట్ అయ్యాడు. ముంబై అండర్ 19 మాజీ ఆటగాడు బల్వంత్ సింగ్ సర్వూప్ సింగ్ సోధాను టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోకి వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ టికెట్లను అధిక ధరలకు విక్రయించినట్లు సోధాపై ఆరోపణలు ఉన్నాయి. ఇతను సాధారణ టికెట్ ధరను ఏకంగా రూ.25వేలకు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. సోధా మొబైల్ స్వాధీనం చేసుకుని, కాల్ డేటా రికార్డులను పరిశీలించగా.. విషయం బయటపడింది. సోధాను పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. అతనికి బెయిల్ మంజూరు అయింది.