
హైదరాబాద్: రాఘవ కన్ స్ట్రక్షన్స్ మైనింగ్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలన్న బీఆర్ఎస్ డిమాండ్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌పై సీఎం సీబీ సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత కూడా హౌస్ కమిటీ విచారణ కోరడం ఏంటని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు హౌస్ కమిటీలు వేసి ఏం చేశారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో హౌస్ కమిటీ విచారణ నివేదికలు ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు.
హౌస్ కమిటీలు వేసి కొందరిని బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో చేర్చుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌస్ కమిటీల పేరుతో విచారణ చేసి భూములను కబ్జాలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బెదిరించేందుకు హౌస్ కమిటీ అని బీఆర్ఎస్ ఆందోళన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల వ్యక్తిగత అవసరాలు తీర్చలేదని మంత్రిపై బురద జల్లాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేం ఎప్పుడు సభను ఆటంకం పర్చలేదని.. కానీ బీఆర్ఎస్ హౌస్ కమిటీ పేరుతో నిన్నటి నుంచి పదే పదే సభను అడ్డుకుంటుందని ధ్వజమెత్తారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారని.. బాలానగర్ భూ దోపిడీపై హౌస్ కమిటీకి బీఆర్ఎస్ సిద్ధమా అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సభ జరగొద్దని నిర్ణయంతోనే బీఆర్ఎస్ వాళ్లు వచ్చారని.. ప్రజా సమస్యలు, సంక్షేమంపై చర్చ జరగొద్దని భావిస్తున్నారని మండిపడ్డారు.