Reading Time: < 1 minute

హైదరాబాద్: ఆదివారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే సభలో గందరగోళం నెలకొంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయడంతో పాటు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో భాగంగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరారు. బిఆర్‌ఎస్ సభ్యులు నినాదాల మధ్య న్యాయవాదులు రక్షణ, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లులను ప్రవేశ పెట్టారు. బిఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. వెంటనే మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఎటువంటి చర్చ లేకుండానే రెండు బిల్లులు ఆమోదించడం సరికాదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాఘవ కన్‌స్ట్రక్షన్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని గన్ పార్క్ దగ్గర బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్లకార్డులతో కెటిఆర్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పొంగులేటి అవినీతి సంపాదనలో సిఎం రేవంత్ కూడా భాగం ఉందని ఆరోపణలు చేశారు. అవినీతికి పాల్పడుతున్న సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి పదవి నుంచి పొంగులేటి వెంటనే తొలగించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.