
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫుట్ బాల్ ఆడారు. గోల్ కూడా కొట్టారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన శాసనసభ్యుల క్రీడోత్సవాల్లో ఆయన ఫుట్ బాల్ ఆడారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మెస్సీ పర్యటన సమయంలో కూడా సీఎం రేవంత్ ఫుట్ బాల్ ఆడిన విషయం విదితమే.
సింగరేణి ఆర్ ఆర్9 టీమ్ కెప్టెన్గా వ్యవహరించిన సీఎం రేవంత్ జెర్సీ నెంబర్ 9 ధరించి ఇంటర్నేషన్ ఫుట్‌బాలర్ డ్రెస్ కోడ్లో స్టేడియంలోకి ప్రవేశించారు. అప్పటికే మొదలైన ఆటలో పాల్గొన్నారు. మూడు నిమిషాలకే సీఎం రేవంత్ ఒక ఫీల్డ్ గోల్‌కొట్టి భళా అనిపించారు. రెండు గోల్ పోస్ట్ల మధ్యన ప్రత్యర్థి డిఫెండర్లను తప్పించుకుంటూ వెళ్లి బాల్ను గోల్ పోస్ట్‌లోకి కొట్టడంతో ఒకే సారి స్టేడియం అంతా మారుమ్రోగిపోయింది. ఇవాళ (శనివారం) జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్లో కూడా సీఎం రేవంత్ అలవోకగా గోల్ కొట్టారు.
అసెంబ్లీ సమావేశాలు వాయిదా తర్వాత శనివారం సాయంత్రం ఈ క్రీడోత్సవాలు జరిగాయి. రాష్ట్రంలో అన్ని వర్గాల్లో క్రీడల పట్ల అవగాహన పెంచేందుకు శాసనసభ్యుల క్రీడోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరిగిన ఈ క్రీడా పోటీల్లో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భాగస్వాములు కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. టగ్ ఆఫ్ వార్, ఫుట్‌బాల్, క్రికెట్, అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ తోపాటు కొన్ని రిక్రియేషనల్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను చూసేందుకు ఉచిత ప్రవేశం కల్పించారు.
ప్రజాప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం, ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని నింపడం కోసమే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటలపోటీలు పెడుతున్నామని స్పోర్ట్స్ కమిటీ చైర్మన్, మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించిన సంగతి తెలిసిందే. మార్చి28, 29 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ‘మొదటి ఎడిషన్ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026’ పేరుతో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. రవీంద్రభారతీలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.