Reading Time: < 1 minute

డాక్టర్పై దాడికి నిరసనగా నిర్మల్ బంద్

Caption of Image.

నిర్మల్, వెలుగు: నిర్మల్​లో పిల్లల డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి  పిలుపు మేరకు  నిర్మల్ బంద్  చేపట్టారు.  శనివారం ఉదయం నుండే వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. డాక్టర్ పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తూ పోలీసుల వైఖరిని తప్పుబట్టారు.  బీజేపీ కార్యకర్తలతో పాటు బజరంగ్ దళ్, హిందూ వాహిని, పలు ప్రజా, స్వచ్ఛంద సంఘాలతోపాటు డాక్టర్లు ఈ బంద్​కు మద్దతు పలికారు. 

ఉదయం నుంచే బీజేపీ కార్యకర్తలు నిర్మల్ లో బైక్ ర్యాలీ నిర్వహించి బంద్ పాటించాలని కోరగా వ్యాపారులు బంద్ కు సహకరించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నేత రావుల రామనాథ్ డిమాండ్ చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి, డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. వైద్యులకు రక్షణ కరువైందని, డాక్టర్లపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

ఖానాపూర్ లో డాక్టర్ల నిరసన

ఖానాపూర్ : నిర్మల్ లో డాక్టర్​సంతోష్ రాజ్ పై అకారణంగా దాడి చేసిన వారిని  కఠినంగా శిక్షించాలని ఖానాపూర్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం ఖానాపూర్ లో నిరసన తెలిపి అక్కడి నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ సుజాతారెడ్డికి వినతిపత్రం అందజేశారు. రోజురోజుకు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిపై దాడులు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

డాక్టర్లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. డాక్టర్స్​అసోసియేషన్ సభ్యులు కిరణ్ కుమార్, కేహెచ్ ఖాన్, అనిల్ బాబు, విజయ్ కుమార్, శివకుమార్, సాయి కిరణ్, చంద్రకిరణ్, సాయి కేతన్, ప్రదీప్, కృష్ణ తదితరులు 
పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.