Reading Time: 2 minutes
ఏప్రిల్‌ 1 నుంచే ఇంటర్ తరగతులు పునఃప్రారంభం.. లెక్చరర్లలో వీడని సందిగ్ధత!

అమరావతి, మార్చి 29: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్‌ విద్యా సంవత్స­రం ఏప్రిల్ 1 నుంచి పునఃప్రారంభం కానుంది. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి రెండో ఏడాదిలోకి వచ్చిన విద్యార్థులకు తరగతులు ప్రారంభం కా­ను­న్నాయి. పరీక్షలు పూర్తయ్యాక నెల కూడా గడవకుండానే వీరికి ఏప్రిల్ 1 నుంచి ఏప్రి­ల్‌ 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నా­రు. ఇంటర్‌ విద్యార్ధులకు ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ఆ తర్వాత జూన్ 1 నుంచే తిరిగి తరగతులు ప్రారంభిస్తారు. వాస్తవానికి రాష్ట్రంలో విద్యా సంవత్స­రం జూన్‌ 12 నుంచి ప్రారంభమవుతుంది. అన్ని స్థాయిల తరగతులు అదే తేదీన ప్రారంభమవుతాయి. కానీ ఇంటర్మీడియెట్‌లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశపెట్టి, సీబీఎస్‌ఈ విధానాన్ని పాటిస్తున్నారు. ఈ క్రమంలో పబ్లిక్‌ పరీక్షల తర్వాత ఏప్రిల్‌లో తరగతులు నిర్వహించి, ఆ తర్వాత వేసవి సెలవులు ఇచ్చేలా విద్యా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు ఈ నెల 18న అకడమిక్‌ క్యాలెండర్‌ను ఇంటర్‌ బోర్డు సెక్రటరి రంజిత్‌ బాషా విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 232 రోజులు జూనియర్‌ కాలేజీలు పని చేయనున్నాయి.

మరోవైపు మార్చి 24వ తేదీతో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు ముగిశాయి. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 5,31,275 మంది విద్యార్థులకు గాను 5,21,266 మంది పరీక్షలు రాశారు. వీరంతా రెండో ఏడాదిలోకి ప్రవేశిస్తారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే తిరిగి ఇంటర్‌ తరగతులు 100 శాతం హాజరుతో ని­ర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జూనియర్‌ లెక్చరర్లు తలలు పట్టుకుంటున్నారు. ఓ వైపు ఏప్రిల్ 14 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం జరగడం.. ఇంకోవైపు అడ్మిషన్లతో లెక్చరర్లు తలమునకలై ఉన్నారు. ఈ రెండు పనులతోపాటు క్లాసులు కూడా నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఆదేశించడంతో లెక్చరర్లపై పనిభారం పడుతుంది. గతేడాది కూడా సరిగ్గా ఏప్రిల్ 1 నుంచి తరగతులు ప్రారంభించినా.. హాజరు 10 శాతానికి మించలేదు. అందుకే 2026-27 విద్యా సంవత్సరంలో ఈ ఏడాది ఏప్రిల్‌ తరగతులను రద్దు చేసి జూన్‌లో రెగ్యులర్‌ విద్యా సంవత్సరం ప్రారంభించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులకు సీబీఎస్‌ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక 2026-27 విద్యా సంవత్సరం నుంచి రెండో ఏడాది విద్యార్థులకు కూడా కొత్త సిలబస్‌ అందుబాటులోకి తెస్తున్నారు. అయితే సిలబస్‌ ఎలా ఉంటుందో, పాఠాలు ఎలా బోధించాలో వంటి వాటిపై ఇప్పటి వరకు లెక్చరర్లకు శిక్షణ ఇవ్వలేదు. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ కొత్త సిలబస్‌ పాఠ్య పుస్తకాలు కూడా ఇంకా అందుబాటులోకీ రాలేదు. ఈ క్రమంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధులకు తరగతులు ప్రారంభిస్తే.. పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేకుండా పాఠాలు ఎలా చెప్పాలి అనే సందిగ్ధత కూడా నెలకొంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.