Reading Time: < 1 minute
ఇదెక్కడి లాజిక్.! క్రికెటర్ల రిటైర్మెంట్‌కు వాళ్లే కారణం.. మళ్లీ నోరు జారిన యువరాజ్ తండ్రి..

Yograj Singh Controversial Comments: భారత మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. ఈసారి ఏకంగా క్రికెటర్ల వ్యక్తిగత జీవితాలపై, వారి భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆటగాళ్లు త్వరగా రిటైర్మెంట్ తీసుకోవడానికి వారి కుటుంబ సభ్యులే కారణమని ఆయన ఆరోపించడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

భార్యలు, పిల్లల వల్లే రిటైర్మెంట్లు?

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న 68 ఏళ్ల యోగ్‌రాజ్ సింగ్, ప్రస్తుత కాలంలో క్రికెటర్లు అకాల రిటైర్మెంట్ తీసుకోవడంపై స్పందించారు. ఇంట్లోని మహిళలు, ముఖ్యంగా భార్యలు ఆటగాళ్లపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. “కుటుంబానికి సమయం ఇవ్వమని, పిల్లలను చూసుకోమని భార్యలే భర్తలకు (క్రికెటర్లకు) నూరిపోస్తున్నారు. దీనివల్ల ఆటగాళ్లు తమ కెరీర్‌ను మధ్యలోనే ముగిస్తున్నారు. అథ్లెట్ల అద్భుతమైన ప్రయాణంలో మహిళలు అడ్డురాకూడదు. క్రీడాకారులకు, దైవచింతన ఉన్నవారికి మతం, వర్గం ఉండదు, వారు భగవంతుడికి చెందినవారు” అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వయసు అనేది ఒక అబద్ధం..

భారతదేశంలో వయసును బట్టి ఆటగాళ్లను అంచనా వేయడం ఒక వింతైన విషయమని యోగ్‌రాజ్ ఎద్దేవా చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి మేటి ఆటగాళ్లు రిటైర్మెంట్ గురించి ఆలోచించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. “రోహిత్, విరాట్ ఇప్పటికీ కుర్రాళ్లే. వారు ఇప్పుడే తప్పుకోవాలనుకోవడం సిగ్గుచేటు. తమలో ఇంకా సత్తా ఉందని, తామే అత్యుత్తమమని ప్రపంచానికి నిరూపించాలి. 50 ఏళ్ల వయసులో కూడా డబుల్ సెంచరీలు బాదితే ఎవరూ జట్టు నుంచి తొలగించలేరు. ఫిట్‌నెస్ ఉంటే వయసుతో సంబంధం లేదు” అని ఆయన పేర్కొన్నారు.

ధోనీపై ప్రశంసల జల్లు..

గతంలో ఎంఎస్ ధోనీపై తీవ్ర విమర్శలు చేసిన యోగ్‌రాజ్, ఈసారి మాత్రం ఆయనను ఆకాశానికెత్తారు. 44 ఏళ్ల వయసులో కూడా ధోనీ అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఉన్నారని కొనియాడారు. “ధోనీ క్రమశిక్షణ, అంకితభావం అమోఘం. ఆయన మరో 10 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడాలి. ఆయనను రిటైర్ అవ్వమని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదు. క్రికెట్ పట్ల ఆయన చూపిస్తున్న ఉత్సాహానికి హ్యాట్సాఫ్” అని అన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..