Reading Time: 2 minutes
RCB vs SRH Highlights : ఆర్సీబీ విజయంలో ఈ ఐదుగురు సూపర్ హీరోలే.. ఎస్ఆర్‌హెచ్‌ను ముంచేసిన పడిక్కల్, డఫీ

RCB vs SRH Highlights : ఐపీఎల్ 2026 సీజన్ గ్రాండ్ ఓపెనింగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ఆటగాళ్లు చిటికెలో ఊదేశారు. కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకున్న బెంగళూరు, లీగ్‌లో శుభారంభం చేసింది. ఈ చారిత్రాత్మక విజయానికి పునాది వేసిన ఐదుగురు రియల్ హీరోల గురించి తెలుసుకుందాం.

కింగ్ కోహ్లీ.. అన్‌స్టాపబుల్ ఇన్నింగ్స్

ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను 2026 సీజన్‌లోనూ కొనసాగిస్తున్నాడు. హైదరాబాద్ పెట్టిన భారీ టార్గెట్‌ను ఛేదించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. కేవలం 38 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. 181.58 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన విరాట్, మ్యాచ్ చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. విరాట్ బ్యాటింగ్‌లో క్లాస్, మాస్ రెండూ కనిపించాయి.

దేవదత్ పడిక్కల్.. ఇంపాక్ట్ ప్లేయర్ మెరుపులు

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి లభించిన అతిపెద్ద సర్ప్రైజ్ దేవదత్ పడిక్కల్. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన పడిక్కల్, ఎస్ఆర్‌హెచ్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. కేవలం 26 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 234.62గా ఉండటం గమనార్హం. పడిక్కల్ ఇచ్చిన ఈ మెరుపు ఆరంభం వల్లే ఆర్సీబీ ఇంత వేగంగా లక్ష్యాన్ని చేరుకోగలిగింది.

జాకబ్ డఫీ.. అదిరిపోయే ఐపీఎల్ డెబ్యూ

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ పటిష్టమైన ఓపెనింగ్ జోడీని డఫీ విడదీశాడు. ట్రెవిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి డేంజరస్ బ్యాటర్లతో పాటు నితీష్ రెడ్డిని కూడా పెవిలియన్‌కు పంపాడు. 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. డఫీ వికెట్లు తీయకపోయి ఉంటే హైదరాబాద్ స్కోరు 230 దాటేది.

కెప్టెన్ రజత్ పాటిదార్.. వేగవంతమైన ముగింపు

ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాడు. జట్టు గెలవడానికి కావాల్సిన పరుగులు తక్కువగా ఉన్నా, తన స్ట్రైక్ రేట్ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. కేవలం 12 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు రాబట్టాడు. 250 పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన పాటిదార్, మ్యాచ్‌ను త్వరగా ముగించడంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఫిల్ సాల్ట్.. ఫీల్డింగ్‌లో సూపర్ మ్యాన్

బ్యాటింగ్‌లో ఫిల్ సాల్ట్ త్వరగా అవుట్ అయినా, ఫీల్డింగ్‌లో మాత్రం అద్భుతాలు చేశాడు. బౌండరీ లైన్ వద్ద అతను పట్టిన రెండు క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (80 పరుగులు), హెన్రిక్ క్లాసెన్ (31 పరుగులు) క్యాచ్‌లను సాల్ట్ అద్భుత రీతిలో అందుకున్నాడు. ఈ ఇద్దరూ కనుక మరో 2-3 ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే హైదరాబాద్ స్కోరు ఎక్కడో ఉండేది. సాల్ట్ ఫీల్డింగ్ విన్యాసాలు ఆర్సీబీకి కొండంత బలాన్ని ఇచ్చాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..