Reading Time: < 1 minute

భారతదేశంలో ప్రసూతి మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 1990 నుంచి 2023 మధ్యకాలంలో అత్యంత విషాదకర ఈ కాన్పుచావుల రేటు దాదాపు 80 శాతం మేర తగ్గుముఖం పట్టింది. ఈ విషయాన్ని ది లాన్సెట్ అబ్‌స్టట్రిక్స్ గైనకాలజీ, ఉమెన్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. ప్రపంచవ్యాప్త విశ్లేషణల క్రమంలో భారతదేశంలో ఈ అత్యంత కీలక శుభ పరిణామం తలెత్తిన విషయాన్ని ఈ నేపథ్యంలో వెల్లడించారు. అంతకు ముందు లక్ష కాన్పుల్లో 508 మరణాలు ఉండేవి. అవి ఇప్పుడు లక్షకు 116కు తగ్గాయని ఈ విశ్లేషణలో తెలిపారు. 2023లో దేశంలో మొత్తం 24700 వరకూ ప్రసూతి మరణాలు రికార్డు అయ్యాయి. ఇది లక్షకు 116 శాతంగా నిలిచింది. ఈ ఏడాదే పాకిస్థాన్‌లో 10300 ప్రసూతి మరణాలు సంభవించాయి. ఆఫ్రికా దేశాలైన ఈథియోపియా,నైజీరియా ఇతర చోట్ల కూడా ఈ మరణాలు ఎక్కువగా ఉన్నాయి. పేదరికం, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం,

ప్రత్యేకించి నిరక్షరాస్యత వంటి పరిణామాలతో, మహిళల పట్ల నిరాదరణ వంటి కారణాలతో ప్రసూతి మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటూ వచ్చింది. అయితే భారతదేశంలో మార్పులతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటికీ ఈ అకాల మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ఆరోగ్య గణాంకాలు, విశ్లేషణ విభాగం (ఐహెచ్‌ఎంఇ) పరిశోధకులు తమ అధ్యయనంలో ఈ సామాజిక ఆందోళనకర పరిణామంపై సర్వే జరిపారు. దేశాలవారిగా చూస్తే ఈ ప్రసూతి మరణాలు ప్రాంతాలను బట్టి వేర్వేరుగా ఉంటున్నాయి. వెనుకబాటుతనం, కుటుంబ కట్టుబాట్లు వంటివి ఇందుకు కారణం అని అధ్యయనంలో తేల్చారు. 204 దేశాలు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుత పరిణామం బట్టి దేశంలో ప్రసూతి మరణాలు తగ్గడం కీలక విషయం అని, దీనిని మరింతగా మెరుగుపర్చుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.