Reading Time: 2 minutes
తొలిసారి ఎన్నికల బరిలో విజయ్.. రెండు చోట్ల పోటీకి సై.. తమిళనాట చరిత్ర తిరగరాసేనా..?

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ తొలిసారిగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన విజయ్ జాబితాను విడుదల చేశారు. టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన విజయ్ తాను రెండు చోట్ల పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తమిళనాడను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా, విద్యార్థులకు నెలవారీ సహాయాన్ని అందిస్తామని టీవీకే అధినేత విజయ్ హామీ ఇచ్చారు. అయితే విజయ్ ఇచ్చిన హామీలు, విజయ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారా అన్న చర్చ మొదలైంది..

రెండు రోజుల క్రితం టివికె తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల సంఘం అనుమతి లేకపోవడంతో రెండు రోజుల ఆలస్యంగా ఈరోజు ఆదివారం (మార్చి 29, 2026) చెన్నైలో విజయ్ తన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ
మా పార్టీ తరపున కొత్తవారికి అవకాశం ఇస్తున్నా అని చెప్పారు. సినిమా నుంచి వచ్చానని నా పార్టీ గురించి తక్కువగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్న వారికి నా గెలుపుతోనే సమాధానం చెబుతానని గట్టిగా బదులిచ్చారు.

ఎమ్మెల్యేలు గా గెలిచి దోచుకోవడం లో మాకు అనుభవం లేకపోవచ్చు.. కానీ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చా అని విజయ్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకుంటానని విజయ్ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తామన్నారు. తమిళ పార్టీలకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు.. ఈసారి తమకు ఓటు వేసి తమిళనాడుకు మంచి చేయాలన్న తమ ఆశయాన్ని గెలిపించాలన్నారు.

నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండిః విజయ్

ఏపీలో 2019లో ఎన్నికలు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న స్లోగన్ తో ప్రజల్లోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లో అనేకంశాలు కలిసి రావడం ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వడంతో ఆ స్లోగన్ బాగా పనిచేస్తుందన్న చర్చ జరిగింది. ప్రస్తుతం తొలిసారిగా ఎన్నికల్లో తలపడుతున్న విజయ్ కూడా తనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలని కోరుతున్నారు.. తమిళనాడులో ఇప్పటికే అనేక సార్లు తమిళ పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈసారి నన్ను గెలిపించండి. మీకు మంచి చేసి చూపిస్తాను అని విజయ్ కోరుతున్నారు.

పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు

అభ్యర్థుల జాబితా ప్రకటన సమయంలో విజయ్ కొన్ని హామీలను కూడా ప్రకటించారు. అందులో కొన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలను తలపించేలా ఉన్నాయన్న చర్చ మొదలైంది. ఆయా జిల్లాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు, యువతకి PhD వరకు చదువుకునేందుకు 20 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తామన్నారు.
తమిళనాడు ఉన్న యువత కు ప్రాధాన్యం కోసం ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 75 శాతం ఉద్యోగాలు తమిళుల కే ఇస్తామన్నారు. వైసీపీ హయాంలో అప్పటి ఎం జగన్ మోహన్ రెడ్డి స్థానికులకు ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్ అనే నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.

తమిళనాడులో వాలంటీర్ వ్యవస్థ

ఇక ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకుని వచ్చారు. గ్రామాల్లో ప్రభుత్వం తరఫున అన్ని చేసేలా కార్యక్రమాలన్నీ వాలంటీర్ల ద్వారానే అందించారు.. ప్రస్తుతం విజయ్ కూడా వాలంటీర్ తరహా వ్యవస్థను తీసుకు వస్తామని, నియమించిన ఆ సిబ్బంది సీఎం తరపున ప్రజా సేవకులుగా పనిచేస్తారని చెప్పుకొచ్చారు. మొత్తానికి విజయ్ చెప్పిన కొన్ని విషయాలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న మాట వినగానే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఒక్క ఛాన్స్ అన్న స్లోగన్ గుర్తుకొస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయనున్నారు. చెన్నై లోని పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..