Reading Time: 2 minutes
చక్కెర పొంగలి గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలంటే ఇలా ఒకసారి చేసి చూడండి

అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాంటి చక్కెర పొంగలిని ఇంట్లోనే తయారుచేసుకునే విధానం ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రెసిపీని అనుసరించి ఎంతో రుచికరమైన, సాంప్రదాయ టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలిని సులభంగా తయారు చేసుకోవచ్చు.

తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం: ముప్పావు కప్పు, పెసరపప్పు: పావు కప్పు, చక్కెర: ముప్పావు కప్పు, బెల్లం: అర కప్పు, నీళ్లు: రెండున్నర కప్పులు (అర కప్పు సిరప్ కోసం),  నెయ్యి: ఒకటిన్నర నుంచి రెండు టేబుల్‌స్పూన్లు (డ్రై ఫ్రూట్స్ వేయించడానికి కూడా కలిపి), పచ్చి కొబ్బరి/ఎండు కొబ్బరి: రెండు టేబుల్‌స్పూన్లు (సన్నగా తరిగినవి), జీడిపప్పు: రెండు టేబుల్‌స్పూన్లు, కిస్‌మిస్‌: రెండు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి: పావు టీస్పూన్, పచ్చ కర్పూరం: చిటికెడు.

తయారీ విధానం:

ముందుగా, స్టవ్ ఆన్ చేసి ప్రెజర్ కుక్కర్‌ను పెట్టుకోవాలి. అందులో పావు కప్పు పెసరపప్పును మీడియం ఫ్లేమ్‌లో నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు, అదే కుక్కర్‌లో వేయించిన పెసరపప్పుతో పాటు ముప్పావు కప్పు బియ్యంను కలుపుకొని, తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఒక కప్పు పెసరపప్పు, బియ్యం మిశ్రమానికి రెండు కప్పుల నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్‌లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ప్రెజర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూస్తే బియ్యం పొడిపొడిగా, చక్కగా ఉడికి ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్‌ను పెట్టుకోవాలి. అందులో ముప్పావు కప్పు చక్కెర, అర కప్పు బెల్లం, అర కప్పు నీళ్లు కలిపి మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ బెల్లం, చక్కెర కరిగే వరకు ఉడికించుకోవాలి. పాకం మరీ ముదురుగా కాకుండా, కాస్త స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈ కరిగిన సిరప్‌ను వడగట్టి, ఉడికించిన బియ్యం మిశ్రమంలో కలపాలి. ఇలా వడగట్టడం వల్ల బెల్లంలో ఉండే మలినాలు వేరు అవుతాయి. పాకం మొత్తం కలిపిన తర్వాత, స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్‌లో స్పూన్‌తో బాగా కలపాలి. ఇందులోకి ఒకటి లేదా రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యిని చేర్చి, చక్కెర సిరప్ పూర్తిగా ఇమిడిపోయే వరకు ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నెయ్యి ఎక్కువగా నచ్చిన వారు మరింత జోడించుకోవచ్చు. చక్కెర పొంగలి ఉడుకుతున్న సమయంలోనే, డ్రై ఫ్రూట్స్‌ను సిద్ధం చేసుకోవాలి. మరో స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని, రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడి అయిన తర్వాత రెండు టేబుల్‌స్పూన్ల సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి, రెండు టేబుల్‌స్పూన్ల జీడిపప్పు, రెండు టేబుల్‌స్పూన్ల కిస్‌మిస్‌లను వేసి లో ఫ్లేమ్‌లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్‌ను ఉడుకుతున్న చక్కెర పొంగలి మిశ్రమంలో కలపాలి. అలాగే పావు టీస్పూన్ ఏలకుల పొడిని కూడా చేర్చి, స్పూన్‌తో మొత్తం కలిసే విధంగా మరో రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించాలి. చివరగా, చిటికెడు పచ్చ కర్పూరంని జోడించి, కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే, టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి సిద్ధమైనట్లే. దీనిని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు.

Also Read: Hyper Aadi: నా ఈ జీవితం అతను పెట్టిన భిక్షే.. ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేస్తే..