Reading Time: < 1 minute
ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి కేంద్రం బంపర్ ఆఫర్.. సబ్సిడీ పొడిగింపు.. మస్త్ డబ్బులు ఆదా..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద అందుతున్న రాయితీలను పొడిగిస్తున్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూవీలర్ కొనుగోలుదారులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీలను జూలై 31 వరకు పొడిగించారు. ఇ-రిక్షా, ఇ-కార్టులపై రాయితీలను ఏకంగా మార్చి 31, 2028 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

లక్ష్యానికి మించి అమ్మకాలు – గణాంకాలు ఇవే

2024 అక్టోబర్ 1న ప్రారంభమైన ఈ పథకం ఆశించిన దానికంటే అద్భుతమైన ఫలితాలను సాధించింది. 1.4 మిలియన్ల ఎలక్ట్రిక్ టూవీలర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఏకంగా 2.48 మిలియన్ల వాహనాలు అమ్ముడవ్వడం విశేషం. దీని కోసం కేటాయించిన రూ. 1,772 కోట్లలో ఇప్పటికే రూ.1,259.91 కోట్లు ఖర్చు చేశారు. త్రీ-వీలర్ల రికార్డ్ విభాగంలో కూడా లక్ష్యాన్ని మించి 1,62,981 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇ-రిక్షా , ఇ-కార్ట్ విక్రయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కేంద్రం ఈ విభాగంలో నిధుల కేటాయింపును రూ.192 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు తగ్గించింది.

పీఎం ఇ-డ్రైవ్ ప్రత్యేకత ఏంటి?

పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కేవలం టూవీలర్లు, త్రీవీలర్లు మాత్రమే కాకుండా ఇ-అంబులెన్సులు, ఇ-ట్రక్కులకు కూడా ప్రభుత్వం భారీగా రాయితీలు కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలు మరింత చేరువవుతున్నాయి. కాగా సబ్సిడీ గడువు పొడిగింపుతో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ముఖ్యంగా టూవీలర్ల విభాగంలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఈవీ విప్లవానికి మరింత ఊతమివ్వనుంది.